‘నాకు, నా మేనల్లుడికి రక్షణ లేదు’.. మమతా బెనర్జీ

Apr 21,2024 23:55 #2024 election, #Mamata Banerjee

కోల్‌కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి భద్రత లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కుమార్‌ గంజ్‌ టీఎంసీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి బిప్లబ్‌ మిత్రా తరుపున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మమతా మాట్లాడుతూ.. ‘బీజేపీ తనను, తన మేనల్లుడిని టార్గెట్‌ చేస్తోంది. రాష్ట్రంలో మాకు భద్రత లేదు. మేము సురక్షితంగా లేము. అయితే బిజెపి కుట్రలకు మేం భయపడం. టిఎంసి నాయకులు, రాష్ట్ర ప్రజలపై కుట్ర జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము.’ అని ఆమె అన్నారు.
సోమవారం ఓ అంశం టీఎంసీని, ఆ పార్టీ అగ్రనేతల్ని కుదిపేస్తుందంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ తాజాగా స్పందించారు. సువేందు అధికారిని ఉద్దేశించి మమతా మాట్లాడుతూ.. ‘తన కుటుంబాన్ని అక్రమ సంపదను కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన ఒక దేశద్రోహి. అతని తాటాకు చప్పుళ్లకు మేం బెదరబోము.’ అని ఆమె స్పష్టం చేశారు.

➡️