ప్రజాస్వామ్యాన్ని బిజెపి జైల్లో పెడితే.. అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుంది

: ఇ-మెయిల్‌ ఇంటర్వ్యూలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : అధికార బిజెపి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడితే, అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.. ప్రజలకు సేవ చేయడానికి, వాగ్దానాలు నెరవేర్చడానికి రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశానని, తాను పదవిలో కొనసాగడానికి రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. ఒక ఇమెయిల్‌ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ ఈ విషయం వెల్లడించారు. తనను అరెస్టు చేయకపోతే లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని బిజెపి అంగీకరించింది, అందుకే తనపై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టారని కేజ్రీవాల్‌ విమర్శించారు. బిజెపి తన ప్లే బుక్‌లోని ప్రతి ట్రిక్కుని ప్రయోగిస్తోంది. అయితే ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్‌ పట్ల తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్‌ ఇమెయిల్‌ ఇంటర్వ్యూ సాగిందిలా…

ప్రశ్న: అరెస్టు అయిన తర్వాత మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. బిజెపి కోరుకున్నప్పటికీ హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేసి ఉండాల్సింది కాదని ఇటీవల మీరు అన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇది ప్రభుత్వ పనితీరులో సమస్యలను తెచ్చిపెడుతుంది కదా, అది రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి కూడా రావచ్చు.. ఫైలుపై సంతకం చేయలేని ముఖ్యమంత్రిగా మీరు ఎలా కొనసాగాలని ఆలోచిస్తున్నారు?
కేజ్రీవాల్‌ : నేను మూడుసార్లు ఎన్నికైన ముఖ్యమంత్రిని. ఢిల్లీ ఓటర్లలో 54 శాతం కంటే ఎక్కువ మంది ఓటు వేశారు. ముఖ్యమంత్రిగా మోడీకి కూడా 54 శాతం ఓట్లు రాలేదు. ప్రజలకు సేవ చేస్తానని, నా వాగ్దానాలను నెరవేరుస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేశాను. 2014 నుండి ఆప్‌ని నాశనం చేయడానికి బిజెపి తన ప్లేబుక్‌లోని ప్రతి ట్రిక్కును ప్రయోగిస్తోంది. అయితే, ప్రజలు అవర్‌ కామ్‌ కీ రాజనీతి (పని రాజకీయాలు) పై విశ్వాసం ఉంచారు. బిజెపి ద్వేషపూరిత, విభజన రాజకీయాలను వారు తిరస్కరిస్తున్నారు.ఈ రోజు నన్ను అరెస్టు చేశారు. రేపు మమత దీదీని, స్టాలిన్‌ సాబ్‌ని, భగవంత్‌ మాన్‌ని తప్పుడు కేసులుపెట్టి వారు అరెస్టు చేస్తారు. అప్పుడు కూడా వారిని రాజీనామా చేయమంటారు. ఇలా వుంటే ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది. విచారణ లేదు, ఆధారాలు లేవు. ఇది కచ్చితంగా గూండాగిరీనే. ప్రపంచంలో నియంతృత్వ పాలనలో తప్ప ఎక్కడైనా ఇటువంటివి జరిగాయా? బిజెపి ప్రజాస్వామ్యాన్ని జైలులో పెట్టాలని చూస్తే, అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుంది. నేను ముఖ్యమంత్రిగా కొనసాగకుండా రాజ్యాంగం కానీ, చట్టపరమైన ఫ్రేమ్‌వర్కు కానీ ఎక్కడా నిషేధం విధించలేదు.

ప్రశ్న : మీరు ఇండియా వేదిక భాగస్వాములతో మాట్లాడకుండానే ”కేజ్రీవాల్‌ యొక్క 10 హామీలు” అంటూ వాగ్దానాలు చేశారు. దేశవ్యాప్తంగా కేవలం 22 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. వేదికకు సంఖ్యాబలం వస్తే సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లో మీ స్వరం ప్రతిధ్వనిస్తుందని భావిస్తున్నారా?

కేజ్రీవాల్‌ : మా 10 హామీలు దేనికి సంబంధించినవి? మన కలల భారతదేశాన్ని నిర్మించడానికి అవి ఒక రోడ్‌మ్యాప్‌. ఇక్కడ ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉన్నాయి. 24 గంటల విద్యుత్‌ సరఫరా, మంచి విద్య, బీమా పథకాలతో నిమిత్తం లేకుండా ఉచిత వైద్యం, చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యానికి స్వేచ్ఛ, అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయడం, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చాం. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, వ్యాపారులకు సులభంగా వ్యాపారం చేయడం, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హౌదా ఇస్తాం. అవినీతిపరులకు రక్షణ కల్పించే బీజేపీ ”వాషింగ్‌ మెషీన్‌”ని నాశనం చేయడంలో ఇండియా వేదిక పార్టీలు భాగస్వాములౌతాయని నేను కచ్చితంగా చెప్పగలను. ఇండియా వేదికకి బలమైన మూలస్తంభం ఆప్‌. జూన్‌ 4న ఇండియా వేదిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మేము ఈ హామీలను సమిష్టిగా నెరవేరుస్తామని నా హామీ.

ప్రశ్న : మీరు గతంలో శరద్‌ పవార్‌, సోనియా గాంధీ వంటి పలువురు నేతలను అవినీతిపరులు అన్నారు. మీరు ఇప్పుడు వారిలో కొందరితో వేదికను పంచుకుంటున్నారు. ఈ వైఖరిలో మార్పు గురించి మీరేమంటారు?

కేజ్రీవాల్‌ : చరిత్రలో ఎన్నడూలేని విధంగా నేడు దేశం నేడు ఓ అసాధారణమైన ప్రజాస్వామ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతి సంస్థపైన ఈ పదేళ్లలో ఎడాపెడా దాడులు జరగడాన్ని మనం చూశాం. ‘ప్రతిపక్ష-ముక్త్‌’ భారతదేశం అనే కలను నెరవేర్చుకోడానికి అది ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నదీ చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలుగా మా విభేదాల గురించి మాట్లాడుకునే సమయం కాదిది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ఏకమై కృషి చేయాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యమే లేకపోతే, మనం ఏ పార్టీలో ఉన్నామనేది అంత ముఖ్యం కాదు.
ప్రధాని మోడీ ‘వన్‌ నేషన్‌, వన్‌ లీడర్‌’ మిషన్‌ను ప్రారంభించారు. దేశంంలో ఇది జరగడానికి మనం అనుమతిస్తే, సాధారణ ప్రజల వాణి వినిపించేందుకు కూడా వీలులేని పరిస్థితి వస్తుంది. మనకు శాశ్వతంగా ఏక పార్టీ పాలన మిగిలిపోతుంది. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయినప్పటికీ, అది జరగకుండా నిరోధించడానికి, నియంతఅత్వం నుండి మన దేశాన్ని రక్షించడానికి ‘2024’ భారతదేశ ప్రజలకు ఉన్న చివరి అవకాశం.

ప్రశ్న : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ రెండు నిర్ణయాత్మక విజయాలు సాధించగలిగింది. కానీ ఢిల్లీ నుంచి లోక్‌సభ సీటును గెలుచుకోలేకపోయింది. ఈసారి మీ పార్టీ విధానం దీనికి భిన్నంగా ఉంటుందా?

కేజ్రీవాల్‌ : ఈసారి రెండు పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. గత పదేళ్లలో ఆప్‌ శరావేగంతో అభివఅద్ధి చెందింది. దశాబ్దంలో జాతీయ పార్టీగా అవతరించిన మొదటి పార్టీగా అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్‌ తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్న ఏకైక పార్టీ మాదే. మాకు నాలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు. భారతదేశం అంతటా స్థానిక సంస్థలకు ఎన్నికైన అసంఖ్యాక సభ్యులు ఉన్నారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో చిన్న ప్రాంతీయ పార్టీగా పోటీ చేశాం. నేడు మేము జాతీయ శక్తిగా ఉన్నాం. జాతీయంగా ఆకర్షించే పాలనా నమునాను కలిగిఉన్నాం. మరో పెద్ద మార్పు ఏమిటంటే మేము పోరాడడం ఇదే మొదటిసారి.

ప్రశ్న : కుల ఆధారిత రిజర్వేషన్లపై మీ పార్టీ వైఖరేమిటి? మొత్తం జనాభాలో వివిధ సెక్షన్ల ప్రజలకు వారి దామాషాను బట్టి రిజర్వేషన్ల వాటా కావాలని హక్కుల గ్రూపులు కోరుతున్నాయి. ఆదాయ, సంపద అసమానతలు ఒక సమస్యగా ముందుకొస్తోంది. దీనిని మీరు ఎలా పరిష్కరిస్తారు?

కేజ్రీవాల్‌ : ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ద్వారానే ప్రపంచంలో ఏ సమాజమైనా సుసంపన్నమవుతుంది. అమెరికాలోను, యూరపులోనూ ఇదే జరిగింది. తూర్పున సింగపూర్‌, జపాన్‌లలోనూ ఇదే జరిగింది. భారత్‌లో మాత్రం నాణ్యమైన ఉచిత విద్య అందరికీ అందుబాటులో లేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లలో మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా. సమాజంలోని అట్టడుగున నివసిస్తున్న వర్గాలు ప్రధాన స్రవంతిలో ఖాళీలను ఆక్రమించుకోవడానికి కుల ఆధారిత రిజర్వేషన్లు సహాయపడతాయి. ఇది వారి హక్కు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్‌ను అంతం చేయాలని భావిస్తున్నందున తమకు 400 ప్లస్‌ సీట్లు కావాలని సీనియర్‌ బీజేపీ సభ్యులు బహిరంగంగా చెప్పడం నాకు షాకింగ్‌గా ఉంది. బీజేపీ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను గౌరవించడం లేదు. వారు దానిని మార్చడానికి తహతహలాడుతున్నారు. కాని మేము మా చివరి శ్వాస వరకు వారితో పోరాడుతాం.

➡️