24 ఎమ్మెల్యేలున్న మీరు.. ఎలా సవాలుచేస్తారు : ప్రియాంక గాంధీ ధ్వజం

 సిమ్లా  :    24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీరు తమ ప్రభుత్వాన్ని ఎలా సవాలు చేస్తారని  కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ  బిజెపిని నిలదీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న సంక్షోభంపై బుధవారం  ఎక్స్ వేదికగా  బిజెపి ప్రభుత్వంపై   విమర్శలు గుప్పించారు.   రాష్ట్రంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి ఓవర్‌టైం పనిచేస్తోందని ధ్వజమెత్తారు.  కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఎలా సవాల్‌ చేస్తుందని  పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉందని, హిమాచల్‌ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకున్నారని అన్నారు.  స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అయితే, బిజెపి ధనబలం, దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజల హక్కుల్ని అణిచివేయాలని చూస్తోందని  ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.

ప్రభుత్వ భద్రతను, యంత్రాంగాన్ని బిజెపి ఉపయోగించుకుంటున్న తీరు దేశ చరిత్రలో మునుపెన్నడూ లేదని, 25 ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలను సవాల్‌ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం అవుతోందని ప్రియాంకాగాంధీ అన్నారు. వారి చర్యల్ని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు గమనిస్తున్నారని, ప్రకృతి  విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవని బిజెపి ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ విపత్తులోకి నెట్టాలనుకుంటోందని దుయ్యబట్టారు.

తమ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మంగళవారం రాత్రి హర్యానాకు తీసుకువెళ్లారని, ఈ రోజు సిమ్లాకు తిరిగి వచ్చారని అన్నారు. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అన్నారు. ఈ రోజు వారందరికీ అసెంబ్లీ వద్ద బిజెపి ఎమ్మెల్యేలు డప్పు చప్పుళ్లతో, నినాదాలతో స్వాగతం పలికారని పేర్కొన్నారు.

కాగా, తమ ఎమ్మెల్యేలను బిజెపి కిడ్నాప్‌ చేసిందని, సిఆర్‌పిఎఫ్‌ సాయంతో వారిని హర్యానాకు తరలించిందని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

➡️