ILO report : దేశంలో ఉపాధి తీరుని బట్టబయలు చేసిన సర్వే

Mar 27,2024 12:17 #Employment, #ILO report, #India

న్యూఢిల్లీ  :    భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉన్నత విద్యలు అభ్యసించిన యువతకు సైతం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని పేర్కొంటున్నాయి. తాజాగా నిరుద్యోగంలో భారతదేశ యువత వాటా సుమారు 83 శాతం మంది ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. మొత్తం నిరుద్యోగ యువతలో సెకండరీ లేదా ఉన్నత విద్య కలిగిన వారి వాటా 2000లో 35.2 శాతం ఉండగా, 20022 నాటికి 65.7 శాతం అంటే  రెట్టింపయ్యిందని వెల్లడించింది.

ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఒ) మరియు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌ (ఐహెచ్‌డి) మంగళవారం ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్ట్‌ -2024 విడుదల చేసింది. 2000 మరియు 2019 మధ్య యువత ఉపాధి, నిరుద్యోగం కొంతమేర పెరిగినప్పటికీ.. కొవిడ్‌ మహమ్మారి సంవత్సరాల్లో క్షీణించిందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ అధ్యయనంలో పేర్కొన్నారు. దేశంలో విద్యావంతులైన యువకులు నిరుద్యోగాన్ని తీవ్ర స్థాయిలో అనుభవిస్తున్నారని తెలిపారు.

శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పిఆర్‌), శ్రామిక జనాభా నిష్పత్తి (డబ్ల్యుపిఆర్‌) 2000 నుండి 2019 మధ్య దీర్ఘకాలిక క్షీణత ఉందని అధ్యయనం పేర్కొన్నప్పటికీ.. 2019 తర్వాత కొంతమేర మెరుగుపడిందని తెలిపింది. రెండు గరిష్ట త్రైమాసికాలను మినహాయించి, కొవిడ్‌ 19కి ముందు, తర్వాత ఆర్థిక నష్టాలతో ఈ మెరుగుదల సమానంగా ఉందని అధ్యయనం తెలిపింది. అయితే ఆర్థిక మాంద్యం సమయంలో ఉద్యోగాల కల్పనలో మార్పు వృద్ధి అవకాశాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుందని .. దీంతో ఈ మెరుగుదలను జాగ్రత్తగా పరిశీలించాల్సి వుందని సర్వే విడుదల సందర్భంగా అధ్యయనవేత్తలు తెలిపారు.

ప్రతికూల మెరుగుదల
గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఉద్యోగ కథనంలో కార్మిక మార్కెట్‌ సూచికలలో కొన్ని ప్రతికూల మెరుగుదలలు కనబరిచింది. అయితే దేశంలో ఉపాధి పరిస్థితిని పరిశీలిస్తే.. వ్యవసాయేతర రంగాలలో తగినంత వృద్ధిని కొనసాగించింది. అదే సమయంలో వ్యవసాయ రంగం నుండి కూడా కార్మికులు ఇతర రంగాల్లోకి మళ్లారు. 2018కి ముందు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యవసాయ రంగంలో ఉపాధి కంటే అధిక రేటుతో పెరిగిందనేది వాస్తవం. అంటే వ్యవసాయ రంగానికి చెందిన కార్మికులు నిర్మాణ, సేవల రంగాలకు మళ్లినట్లు తెలుస్తోంది.

సుమారు 90 శాతం మంది కార్మికులు (వ్యవసాయేతర) అనధికారిక పనుల్లో ఉన్నారని సర్వే స్పష్టం చేసింది. అయితే 2000 తర్వాత క్రమంగా పెరిగిన సాధారణ శ్రమ వాటా 2018 తర్వాత క్రమంగా క్షీణించింది. ఈ సమయంలో ప్రజల జీవనోపాధి అభద్రతతో ఉందని నివేదిక తెలిపింది. వ్యవసాయేతర, వ్యవస్థీకృత రంగాల్లో సామాజిక రక్షణ చర్యలు కొద్ది శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ”మోసపూరిత కాంట్రాక్టుల (ఉద్యోగిగా కొనసాగినా కాంట్రాక్ట్‌ కార్మికునిగానే పరిగణించడం) పెరుగుదల ఉందని, అయితే వీటిలో కొద్ది శాతం మందిని మాత్రమే దీర్ఘకాలిక కాంట్రాక్టుల్లోకి తీసుకున్నారని నివేదిక తెలిపింది.

దేశ జనాభాలో యువ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే.. అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను కలిగిలేరని తెలిపింది. 75 శాతం మంది యువత అటాచ్‌మెంట్‌లతో ఇమెయిల్‌ పంపలేరని, 60 శాతం మంది ఫైళ్లను కాపీ, పేస్ట్‌ చేయలేరని, 90 శాతం మంది స్ప్రెడ్‌ షీట్‌ను రూపొందించలేరని నివేదిక వెల్లడించింది.

పెరుగుతున్న పురుష, మహిళా కార్మికుల మధ్య అంతరం
నాణ్యమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ముఖ్యంగా ఉన్నతవిద్యను అభ్యసించిన వారు అత్యధిక స్థాయిలో నిరుద్యోగంలో ఉన్నారని నివేదిక పేర్కొంది. మరోవైపు తక్కువ వేతనాలకు మహిళా శ్రామిక శక్తి అందుబాటులో ఉంటడంతో .. దేశ కార్మిక రంగంలో కూడా గణనీయమైన లింగ అంతరాన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉన్నత విద్యావంతులు అందుబాటులో ఉన్న తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలను స్వీకరించేందుకు ముందుకు రారని, మంచి ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తుంటారని నివేదకి స్పష్టం చేసింది. ” యువతీ యువకులలో ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో నిరుద్యోగ సవాలు అపారమైనది” అని నివేదిక అభివర్ణించింది.

పెరుగుతున్న సామాజిక అసమానతలు
నిశ్చయాత్మక చర్యలు, విధానాలు ఉన్నప్పటికీ.. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు మెరుగైన ఉద్యోగాలు పొందడంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు ఆర్థిక అవసరాల కారణంగా శ్రామిక శక్తి వైపు మళ్లుతున్నారు. తక్కువ వేతనంతో కూడిన తాత్కాలిక పనులు, అనధికారిక ఉపాధి రంగాల వైపు మళ్లుతున్నారని పేర్కొంది.

➡️