కాంగ్రెస్‌ మొండి వైఖరి కారణంగా ‘ఇండియా’ విచ్ఛిన్నం అవుతోంది : జెడియు నేత కెసి త్యాగి

Jan 27,2024 16:25 #Congress, #jdu, #K C Tyagi

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మళ్లీ బిజెపివైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెడియు నేత కెసి త్యాగి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా’లో చీలికలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మొండి వైఖరి కారణంగానే.. ఇండియా విచ్ఛిన్నమయ్యేలా ఉందని ఆయన అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌, బిజెపి కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇండియా ఫోరమ్‌లో ఉన్న కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అఖిలేష్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ పార్టీల నేతలంతా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అలాగే ‘ఇండియా’ వేదికలో భాగస్వామ్యమైన మరో పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికైన టిఎంసి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలనకు అప్పగించాలని కాంగ్రెస్‌ నేతలు కోరుకునే దారుణ పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యారు యాత్రకు అనుమతి ఇవ్వకుండా మమతా బెనర్జీ వివాదాన్ని మరింత పెంచారు. ప్రస్తుతం మనకున్న ‘ఇండియా’ ఫోరమ్‌ క్షీణించిపోయే దశలో ఉంది అని ఆయన అన్నారు.

కాగా, బీహార్‌లో రాజకీయ సంక్షోభం మధ్య కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం బీహార్‌లోని బక్సర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆ రాష్ట్ర సిఎం నితీష్‌కుమార్‌తో కలిసి కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌ చౌబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని చౌబే ఏది జరిగినా దేవుని కోరిక ప్రకారం జరుగుతుంది అని అన్నారు. ఇక ఈరోజు లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మరోవైపు నితీష్‌కుమార్‌ మళ్లీ బిజెపివైపు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాల మధ్య కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ 2025లో బీహార్‌లో బిజెపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గట్టిగా చెప్పారు. 2025లో బిజెపి రాష్ట్ర ప్రజలు బిజెపికే ఓటు వేస్తారు అని సింగ్‌ అన్నారు.

➡️