పారిశ్రామిక ఉత్పత్తి నేలచూపులు

3.8కి పడిపోయిన ఐఐపి
న్యూఢిల్లీ : దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) నేల చూపులు చూస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని.. ప్రపంచంలోనే టాప్‌ 3 స్థానంలోకి రానుందని ప్రధాని మోడీ చేస్తోన్న ప్రకటనలకు భిన్నంగా గణంకాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఏడాది జనవరిలో ఐఐపి 3.8 శాతానికి మందగించింది. ఇంతక్రితం డిసెంబర్‌లో ఇది 4.24 శాతం పెరుగుదలను కనబర్చింది. 2023 జనవరిలో 5.8 శాతం వృద్థి చోటు చేసుకుంది. గడిచిన జనవరిలో ముఖ్యంగా తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ రంగం ఉత్పత్తి 3.2 శాతానికి పడిపోయింది. డిసెంబర్‌లో 4.5 శాతం పెరిగింది. మరోవైపు మైనింగ్‌, విద్యుత్‌ ఉత్పత్తి రంగాలు మాత్రం వరుసగా 5.9 శాతం, 5.6 శాతం చొప్పున వృద్థిని నమోదు చేశాయి. ఈ రంగాలు డిసెంబర్‌లో 5.2 శాతం, 1.2 శాతం చొప్పున పెరిగాయి.

మేక్‌ ఇన్‌ ఇండియా వైఫల్యం : ఏచూరి
పారిశ్రామిక ఉత్పత్తి గణంకాలను పరిశీలిస్తే ప్రధాని మోడీ పదే పదే చెబుతోన్న మేక్‌ ఇన్‌ ఇండియా ఘోరంగా విఫలమైందన్న వాస్తవం స్పష్టమవుతోందని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గడిచిన జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 5.8 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవస్థను వాస్తవం కంటే ఎక్కువ చేసి మోడీ సర్కార్‌ అభూతకల్పనలు సృష్టిస్తోందన్నారు.

➡️