ఐఎన్‌ఎల్‌డి అధినేత నఫే సింగ్‌ దారుణ హత్య

Feb 26,2024 11:04 #INLD chief, #Nafe Singh

న్యూఢిల్లీ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్‌ చౌతాలా స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బహదూర్‌గఢ్‌ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాఠీ దారుణ హత్యకు గురయ్యారు. బిజెపి పాలిత హర్యానాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అక్కడ హింసకు హద్దే లేకుండా పోతోంది. పట్టపగలే దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. నఫే హత్య అందుకు తాజా ఉదాహరణ. ఝుజ్జర్‌ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని దుండగులు కారులో వెంబడించి కాల్పులు జరిపి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నఫే సింగ్‌తో పాటు మరో పార్టీ కార్యకర్త కూడా చనిపోయారు. ఇద్దరు వ్యక్తిగత గన్‌మెన్‌లు గాయపడ్డారు. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు నఫే సింగ్‌ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారని, దాంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నఫే సింగ్‌ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

➡️