చెల్లని మోడీ మ్యాజిక్‌

  • మెజార్టీ ఫిగర్‌కు బిజెపి దూరం
  • హిందీ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు
  • ఆదుకోని అయోధ్య రామయ్య
  • గణనీయంగా పుంజుకున్న ‘ఇండియా’

న్యూఢిల్లీ : సొంత బలంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశించిన కమలదళానికి పరాభవం తప్పలేదు. నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అధిష్టించాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరైంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు సాధించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని బీరాలు పలికిన కమలనాథులు ఖంగుతిన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 272ని కూడా బిజెపి చేరుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 353 స్థానాలు సాధించిన ఎన్డీయే కూటమి ఇప్పుడు 300 స్థానాలు గెలుచుకోవడమే కష్టమైపోయింది. మోడీ-షా ద్వయం ఇమేజ్‌ బిజెపికి ఓట్ల వర్షం కురిపించలేకపోయింది. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీని అయోధ్య రామయ్య ఆదుకోలేదు. యూపీ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, హర్యానాలో కాషాయ పార్టీకి ప్రజలు కషాయం తాగించి చేదు అనుభవాన్ని రుచి చూపించారు. ఈ రాష్ట్రాల నుంచి గతంలో గెలుచుకున్న స్థానాల్లో సగం స్థానాలను కూడా ఆ పార్టీ ఈసారి దక్కించుకోలేదు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ రాష్ట్రాలు బిజెపి పరువు కాపాడాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదుకున్నాయి. రాజధాని ఢిల్లీలో బిజెపి క్లీన్‌స్విప్‌ చేసింది. ఈ విజయాలు లేకుంటే కేంద్రంలో ఇండియా బ్లాక్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. కాంగ్రెస్‌తో ప్రధాన పోటీ ఉన్న చోట్ల బిజెపి కొంతమేర నష్టపోయింది. గత పది సంవత్సరాల కాలంలో ఈ విధంగా కాంగ్రెస్‌ చేతిలో బిజెపికి ఎదురు దెబ్బలు తగలడం ఇదే మొదటిసారి.
ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రామమందిర నిర్మాణం తమకు కలిసొస్తుందని, రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేస్తామని బిజెపి నేతలు ఆశించారు. అయితే వారి కలలు కల్లలయ్యాయి. యోగి డబుల్‌ ఇంజిన్‌ మంత్రం పారలేదు. కమలదళం జోరుకు ఇండియా కూటమి కళ్లెం వేసింది. బిజెపి కంటే సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ బ్లాక్‌కే ఎక్కువ స్థానాలు లభించాయి. రైతు నేత చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా రాష్ట్రీయ లోక్‌దళను ప్రతిపక్ష కూటమి నుంచి వేరుచేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, అప్నాదళ్‌ (సోనేలాల్‌), నిషాద్‌ పార్టీ వంటి చిన్నా చితకా పక్షాలతో జట్టు కట్టి గోదాలో దిగినా చతికిలపడాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ బిజెపికి అండగా నిలిచిన గుజ్జర్లు, రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు ఈసారి దూరమయ్యారు. మరోవైపు ఆర్థిక పరిస్థితులు, రైతు కష్టాలు వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలు ఓటర్ల మెప్పు పొందాయి. మందిర నిర్మాణం జరిగిన అయోధ్యలో (ఫైజాబాద్‌) కూడా బిజెపి ఓటమి పాలైంది. బిజెపి పాలనలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందీ ప్రజలకు వివరించడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. కులగణన అంశం కూడా ఇండియా బ్లాక్‌కు కలిసొచ్చింది. రాయబరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా ఆయన గెలుపొందారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ బిజెపి 62 స్థానాలు గెలుచుకుంది. 2014లో అప్నాదళ్‌తో కలిసి పోటీ చేసి 73 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం బాగా నష్టపోయింది. 2022 శాసనసభ ఎన్నికల్లో ప్రారంభమైన పతనం ఇప్పుడూ కొనసాగింది. ముస్లింలు, బీసీలు..ముఖ్యంగా యాదవులు ఇండియా బ్లాక్‌కే ఓటేశారు. బిఎస్‌పికి ఓటేసే దళితులు కూడా ఈసారి ఇండియా బ్లాక్‌ పక్షాన నిలిచారు. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే వారణాసిలో ప్రధాని మోడీ మెజారిటీ సైతం తగ్గిపోయింది.
తమిళనాడులో ఇండియా బ్లాక్‌ ఘన విజయాలు నమోదు చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పరాజయాన్ని చవిచూశారు. అన్నాడిఎంకె అడ్రస్‌ గల్లంతైంది. మహారాష్ట్రలోనూ బిజెపి ఎత్తుగడలు పారలేదు. శివసేన, ఎన్‌సిపి వంటి ప్రధాన పార్టీలను చీల్చి రాజకీయ లబ్ది పొందుదామని ఆశించిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఏక్‌నాథ్‌ షిండే రూపంలో శివసేనను, అజిత్‌ పవార్‌ రూపంలో ఎన్‌సిపిని చీల్చి రాజకీయంగా లబ్ది పొందుదామని ఆశించినా ఫలితం లేకపోయింది. ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో ఏర్పడిన మహా వికాస్‌ అఘాడీ మంచి ఫలితాలు సాధించింది. పశ్చిమ బెంగాల్‌లోనూ ప్రతిపక్షాలదే పైచేయి అయింది. రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో ఆ పార్టీకి 18 స్థానాలు లభించగా ఈసారి సగానికి సగం తగ్గిపోయాయి. మరోవైపు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ తన బలాన్ని పెంచుకుంది.
రాజస్థాన్‌లో కూడా కాషాయ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. గతంలో ఉన్న స్థానాలను సైతం ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. అన్నదాతల ఆగ్రహం కారణంగా హర్యానా, పంజాబ్‌లోనూ పరాజయాలను మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఒడిశాలో మాత్రం బిజెపికి మంచి ఫలితాలు వచ్చాయి. ఆరు పర్యాయాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలనూ బిజెపియే గెలుచుకుంది. జార్ఖండ్‌లో బిజెపి మంచి ఫలితాలే సాధించినప్పటికీ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా పరాజయం పాలయ్యారు. జెఎంఎం నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేయడంతో ఆగ్రహించిన గిరిజన ఓటర్లు ఇండియా బ్లాక్‌కు ఓటేశారు. గుజరాత్‌ నుండి దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి లోక్‌సభలో అడుగు పెట్టారు.

➡️