మెయితీ సాయుధుల గుప్పెట్లో మణిపూర్‌

itlf protest against on manipur violence
  • కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్య 
  • ఆదివాసీ నేతల వేదిక ఆగ్రహం

గౌహతి : మణిపూర్‌లో సంఫ్‌ు పరివార్‌ కనుసన్నల్లో నడుచుకుంటున్న మెయితీలకు కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు పరోక్షంగా అధికారాన్ని కట్టబెట్టాయని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మూలవాసులకు అన్యాయం చేసి పెత్తందారి మెయితీలకు చెందిన సాయుధ తీవ్రవాద గ్రూపు అరంబై తెంగ్గోల్‌కు రాష్ట్రాన్ని అప్పగించారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎంపిలు, ఎమ్మెల్యేలపైనా అరంబై తెంగ్గోల్‌ పెత్తనం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. జాతి విద్వేష దాడులతో మణిపూర్‌ నెత్తుటి పుండుగా మారడానికి అరంబై తెంగ్గోల్‌ సాయుధ గ్రూపు దాడులే కారణమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థ రాష్ట్ర ప్రజాప్రతినిధులపై పెత్తనం చెలాయిస్తున్నా…కిమ్మనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటూ స్థానిక ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ ఆదివాసీలకు చెందిన ఇండిజినస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) గురువారం భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఐటిఎల్‌ఎఫ్‌ నేతలు మాట్లాడుతూ సాయుధ గ్రూపు అరంబై తెంగ్గోల్‌ ఆగడాలు శృతిమించిపోతున్నాయన్నారు. ఇంఫాల్‌లో బుధవారం ప్రజాప్రతినిధులతో సభ నిర్వహించిన తెంగ్గోల్‌ గ్రూపు వారితో తమకు అనుకూలంగా ప్రమాణాలు తీసుకుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ కూడా పాల్గొన్నాని ఐటిఎల్‌ఎఫ్‌ నేతలు పేర్కొన్నారు. ఈ సభా వేదిక వద్దకు అరంబై తెంగ్గోల్‌ నాయకుడు కొరౌంగన్‌బా ఖుమాన్‌ పోలీసు వాహనంలో వచ్చినా.. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది మౌన ప్రేక్షకుల్లా ఉండిపోవడం ఆందోళనకరమన్నారు. కేంద్రం పంపిన ప్రత్యేక భద్రతా బృందం నగరానికి సమీపంలో క్యాంప్‌ నిర్వహిస్తున్నప్పుడే జరిగిందని గుర్తు చేశారు. కాగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తీవ్రవాద సంస్థ నేతలను పోలీసుల వాహనాల్లో ఎలా తరలిస్తుందని ఐటిఎల్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించింది. ఖుమాన్‌ తాను చేసే పనులను రహస్యంగా ఉంచుకునే వ్యక్తికాదని, రైఫిల్స్‌ పట్టుకుని ఉన్న చిత్రాలను క్రమం తప్పకుండా పోస్ట్‌ చేస్తుంటాండని పేర్కొంది. గిరిజనులపై దాడులకు పిలుపునిస్తూ బహిరంగ ప్రసంగాలు చేస్తాడని, పోలీసులు, భద్రతా సిబ్బంది నుంచి దొంగలించిన అధునాతన ఆయుధాలను అరంబై తెంగ్గోల్‌ కార్యకర్తలు బహిరంగంగా ప్రదర్శిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం ఉన్నాయని ఐటిఎల్‌ఎఫ్‌ గుర్తు చేసింది. అయినా ఇలాంటి వ్యక్తిపై ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవని ఐటిఎల్‌ఎఫ్‌ ప్రశ్నించింది.

➡️