మారని కేంద్రం తీరు

kerala finance minister balagopal fire on centre
  • చర్చల్లో అదే ప్రతికూల ధోరణి 
  • సుప్రీంకోర్టులో కేసును సాకుగా చూపుతోంది
  • రుణ పరిమితిలో సడలింపు లేదు 
  • కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత కూడా కేంద్రం తీరు మారలేదు. కేరళపై ఆర్థిక దిగ్బంధనం తొలగించి సమాఖ్య స్పూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే ప్రతికూల వైఖరిని ప్రదర్శించింది. కోర్టు సూచన మేరకు గురువారం నాడిక్కడ జరిగిన చర్చల్లో రాష్ట్రానికి రుణ పరిమితిపై విధించిన కోతను ఎత్తివేసేందుకు కానీ, కేరళకు కేటాయింపులను పునరుద్ధరించేందుకు కానీ ఎలాంటి సుముఖత చూపలేదు. సుప్రీంకోర్టులో కేసు అనేక అంశాలకు అడ్డుగా నిలుస్తోందంటూ చర్చలో కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన వైఖరి తీసుకుందని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ చెప్పారు. చర్చల అనంతరం కేరళ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ మాట్లాడుతూ, కేరళను ఇబ్బంది పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ధోరణిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. కాగా కేరళ ప్రభుత్వ పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే సోమవారం జరగనుంది.

గురువారం కేంద్రంతో జరిగిన చర్చల్లో కేరళ తరపున ఆర్థికశాఖ మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కెఎం అబ్రహం, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రవీంద్ర కుమార్‌ అగర్వాల్‌, అడ్వకేట్‌ జనరల్‌ కె గోపాలకృష్ణ కురుప్‌ పాల్గొనగా, కేంద్రం తరపున ఆర్థికశాఖ కార్యదర్శి టివి సోమనాథన్‌ నేతృత్వంలోని అధికారుల బృందం హాజరైంది.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రులు చర్చలకు రాలేదు. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ విధానాన్ని అవలంభించింది.

కేంద్రంతో జరిపిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని బాలగోపాల్‌ అన్నారు. ‘అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, పరిష్కారం దగ్గరకొచ్చేసరికి సుప్రీంకోర్టులో కేసును సాకుగా చూపి కేంద్ర బృందం తప్పించుకునే ప్రయత్నం చేసింది. అందువల్ల చర్చలు ఆ స్థాయిలో ముందుకు సాగలేదు. లెక్కల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. రానున్న రోజుల్లో విధానపరమైన అంశాల్లో కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందేమో చూడాలి. తక్షణ ఉపశమనంగా మంజూరు చేయగల అత్యంత సహేతుకమైన విషయాలపై ప్రత్యేక పిటిషన్‌ వేయబడింది. ఆ విషయంలోనూ అనుకూల పరిస్థితి లేదు. కోర్టును ఆశ్రయించినందుకు కేంద్రం కేరళపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇగో సమస్య కాదు. కేంద్రం, రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలి. అదే కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం. ఈ అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున ఎక్కువ చెప్పదలచుకోలేదు’ అని కెఎన్‌ బాలగోపాల్‌ తెలిపారు.

➡️