కేరళ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో మహా ధర్నా

kerala protest against central govt

పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్‌, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

డిఎంకె కూడా

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :  కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గురువారం ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించనుంది. ఈ నిరసన కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రివర్గంలోని యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పొరుగు రాష్ట్రం డిఎంకె కూడా ఈ నిరసనకు మద్దతుగా పాల్గొననుంది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల్లో వాటాను కుదించివేయడం, జిఎస్‌టి పరిహారం నిలిపివేయడం, రెవిన్యూలోటు భర్తీకి ఇవ్వాల్సిన గ్రాంట్లను తొక్కిపట్టడం, రాష్ట్రాలు చేసే రుణాల పరిమితిని కుదించివేయడం వంటి చర్యల ద్వారా ఆర్థిక ఫెడరలిజంపై కేంద్రం ఎడాపెడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా బిజెపి యేతర పాలిత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకను టార్గెట్‌గా పెట్టుకుని ఈ దాడులను తీవ్రతరం చేస్తోంది. ఆర్థిక ఫెడరలిజం సూత్రాలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ దారుణ వివక్ష మూలంగా రాష్ట్ర అర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. అభివృద్ధి కార్యక్రమాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని మానవాభివృద్ధి సూచికల్లోను కేరళ టాప్‌లో ఉంది. నాలెడ్జి ఎకానమీగా అవతరిస్తున్న తరుణంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటువంటి నీచమైన దాడులకు పాల్పడుతోంది. దీనికి వ్యతిరేకంగా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 650 కి.మీ పొడవుగాన మానవ హారం నిర్మించింది. అయినా కేంద్ర ప్రభుత్వ తీరు మారకపోవడంతో దేశ రాజధానిలో మహాధర్నాకు సిద్ధమైంది.

కేరళ మనుగడ కోసమే..

కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా ఢిల్లీ చేస్తున్న పోరాటం కేరళ ప్రగతికి, మనుగడకు సంబంధించిన పోరాటమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. ఈ పోరాటానికి యావత్‌ దేశం మద్దతిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నాడిక్కడ కేరళ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసమే తాము ఈ పోరాటాం చేస్తున్నామే తప్ప రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు అని ఆయన అన్నారు. దేశంలోని 17 బిజెపి పాలిత రాష్ట్రాల పట్ల, ఎన్‌డిఏయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం ఒకే తీరుగా వ్యవహరించకుండా వివక్ష చూపుతోందని, దీనిపై గొంతెత్తాల్సిన అవసరముందన్నారు.

➡️