Loan: కేంద్రంపై కేరళ విజయం

  • రాష్ట్రం కోరిన రూ.13608 కోట్ల రుణం ఇవ్వండి 
  • సుప్రీం కోర్టు ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిని తగ్గించినందుకు కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న కేరళకు తొలి విజయం లభించింది. కేరళ కోరినవిధంగా 13,608 కోట్ల రుణాన్ని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేరళ వాదన సహేతుకమైనది కాబట్టే కేంద్రం తలొగ్గక తప్పలేదు. కేరళ లేవనెత్తిన మిగతా డిమాండ్లకు సంబంధించి మరోసారి చర్చించాలని ఇరు పక్షాలకు కోర్టు సూచించింది. ఇరుపక్షాలు దీనికి అంగీకరించాయి కేరళ దావాను ఉపసంహరించుకుంటేనే రుణం ఇస్తామని కేంద్రం షరతు పెట్టడం సరికాదని చెప్పింది. ఆర్టికల్‌ 131 ప్రకారం పిటిషన్‌ దాఖలు చేసే హక్కు కేరళకు ఉందని తేల్చి చెప్పింది. అయినా, అటువంటి షరతును కేంద్రం ఎలా విధిస్తుంది అని అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణిని ఉద్దేశించి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. ఈ వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం దొరకని పక్షంలో కోర్టు జోక్యం చేసుకుంటుందన్నారు. తుది తీర్పు వెలువడేవరకు దీనిపై ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయరాదని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.

కేరళ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ రూ. 13,608 కోట్ల మొత్తం రాష్ట్రానికి సంబంధించినదేనని, అది కేంద్రం ఇచ్చే రాయితీ కాదని అన్నారు. కేంద్రం వివక్ష కారణంగా కేరళ ఆర్థికంగా చాలా ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తోందని, ఈ రీత్యా రాష్ట్రానికి మరో రూ.50 వేల కోట్ల రుణాలు విడుదలజేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సిబల్‌ వాదించారు. ధర్మాసనం జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి ఈ రోజు, రేపు సమావేశం కావాలని సూచించింది.

➡️