హిమాచల్‌, తెలంగాణా ఎన్నికలపై జోస్యం చెప్పి బోల్తా పడ్డ కిషోర్‌

May 24,2024 02:15

కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పరస్పర విరుద్ధ ప్రకటనలు
న్యూఢిల్లీ :ఎన్నికల నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ది వైర్‌కు చెందిన జర్నలిస్టు కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఒక దశలో అసహనంతో రుసరుసలాడారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముందు ప్రశాంత్‌ కిషోర్‌ జోస్యం చెబుతూ బిజెపికి 300 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో 2019తో పోల్చితే మోడీపై సామాన్యులకు ఉన్న ఆసక్తి చాలా వరకు పోయింది. మోడీ పట్ల గుడ్డి భక్తి కూడా తగ్గింది. గత అయిదేళ్లలో సోషల్‌ మీడియాలో మోడీ వీడియోల వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని కిషోర్‌ చెప్పారు. గతంలో 50 లక్షలకు చేరువలో వ్యూస్‌ రాగా ఇప్పుడు 10-20 లక్షలకు తగ్గాయి. మొత్తం మీద బిజెపి మోడీల పాపులారిటీ కాస్తా తగ్గింది. 2019లో బాలాకోట్‌, పుల్వామా ఘటనల తరువాత తీవ్ర జాతీయవాద భావాల ఆధారంగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బిజెపి 303 సీట్లు సాధించింది. చాలా మంది ప్రజలు మోడీ పట్ల చాలా భ్రమలు పెట్టుకున్నారు. అయితే, ఈ కాలంలో ఆ భ్రమలు తొలగిపోయాయన్నారు.అయినా, గతసారి వచ్చిన సీట్లను బిజెపి ఎలా నిలుపుకుంటుందని చెప్పడం ఆయనలోని అయోమయాన్ని సూచిస్తోంది. 2022 మేలో జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని అంచనా వేశారు. కానీ, దానికి విరుద్ధంగా కాంగ్రెస్‌ అక్కడ విజయం సాధించింది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లోనను ప్రశాంత్‌ కిషోర్‌ లెక్కలు తప్పాయి. థాపర్‌ హిమాచల్‌ ఎన్నికల్లో మీ అంచనాలు తప్పు అని తేలాయి కదా అని అడిగినప్పుడు కిషోర్‌ ఫైర్‌ అయ్యారు. అలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. ఎందుకంటే ఆ ప్రకటనకు సంబంధించిన వీడియో ఏదీ రికార్డు కాలేదు గనుక.వార్తా పత్రికలు, పోర్టల్‌లు ఇష్టానుసారంగా ప్రకటనలను వక్రీకరించగలవు. కాబట్టి అవి సాక్ష్యాలుగా సరిపోవు అని కిషోర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు రావు అని అంటూనే దానికి వందకు పైగా సీట్లు వస్తే బిజెపికి 300 సీట్లు వస్తాయని అన్నారు. జూన్‌ 4 తరువాత మీకు ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వస్తాయని చివరిలో కిషోర్‌ ముక్తాయింపు ఇచ్చారు.

➡️