పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం : కుమారస్వామి

Apr 30,2024 01:19 #Prajwal Revanna, #sex scam
  •  కఠిన చర్యలు తీసుకోవాలి : ఐద్వా
  • ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, హసన్‌ ఎంపి, ప్రస్తుత జెడి (ఎస్‌) అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వీడియోలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌ డి కుమార స్వామి సోదరుడు హెచ్‌డి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ అమ్మాయిలతో వున్న అభ్యంతరకర వీడియోలు మూడు వేల దాకా ఉన్నాయి. బాధితురాలు, రేవణ్ణ ఇంటి పని మనిషి (47) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ, ఎంపి ప్రజ్వల్‌పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇంటి పనిమనిషి, బంధువే కావడం గమనార్హం. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో, వసతి గృహంలో పని కల్పించాడు. ఆ తరువాత 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేసేవారు. వారందరూ లైంగిక దాడులకు గురయ్యారని బాధిత మహిళ తెలిపింది. రేవణ్ణ మహిళలను తన గదికి తరచూ పిలిపించుకునేవాడని, భార్య ఇంట్లో లేని సమయంలో స్టోర్‌ రూమ్‌కు రప్పించుకునేవాడని, ఆ రాసలీలల వీడియోలను చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మళ్లీ అలాంటి చర్యలకే పాల్పడేవాడని బాధితురాలు తెలిపారు. వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇప్పుడు ఆయన దాష్టీకాలను బయటపెడు తున్నానని బాధితురాలు తెలిపారు. తనపైనా, తన కుమార్తెపైనా ప్రజ్వల్‌ , ఆయన తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లకు పని మానేసి బయటకి వచ్చేశానని.. వీడియోలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నానని బాధితురాలు వాపోయింది.

వీడియోలు తీసి బెదిరింపులు..
పజ్వల్‌ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా మూడు వేలకుపైగా వీడియోలు తీశాడని, వెయ్యి మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సిట్‌ ఏర్పాటు
జెడిఎస్‌ ఎంపి రాసలీల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఎడిజిపి బికె సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ ప్రకటించారు. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్‌ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు ఉడాయించడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. సిట్‌ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్‌ తెలిపారు.
వీడియోలు వెలుగులోకి రావడంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టివి చానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సిఎంకు లేఖ రాశారు.ఈ విషయమై
ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ బెంగళూరులో మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కావాలని మార్ఫింగ్‌ వీడియోలను ప్రచారం చేశారని ప్రజ్వల్‌ ఆరోపించారు.

జెడి(ఎస్‌) నుంచి సస్పెండ్‌ చేస్తాం : కుమారస్వామి
ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని జెడి(ఎస్‌) నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం తెలిపారు. ‘ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రేపు హుబ్బళ్లిలో జరిగే కోర్‌ కమిటీ సమావేశంలో సిఫార్సు చేయాల్సి ఉంది. ప్రజ్వల్‌ ఎంపి కాబట్టి ఈ విషయంపై జెడి(ఎస్‌) జాతీయ అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు విజ్ఞప్తి చేశాను’ అని చెప్పారు. ప్రజ్వల్‌ అఘాయిత్యాల విషయం తనకు కాని, దేవెగౌడకు కాని తెలియదని చెప్పారు.
కఠిన చర్యలు తీసుకోండి : ఐద్వా
ముందే తెలిసినా చర్యలు తీసుకోని బిజెపి
ప్రజ్వల్‌ దుశ్చర్యలపై ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజ్వల్‌ దుశ్చర్యల గురించి బిజెపి పెద్దలకు ముందే తెలుసునని పేర్కొంది. అతని పెన్‌డ్రైవ్‌లో మూడు వేలకు పైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో జెడి(ఎస్‌)తో పొత్తు పెట్టుకుంటే బిజెపికే నష్టమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సీనియర్‌ నాయకులు దేవరాజ గౌడ డిసెంబరు 23నే లేఖరాశారు. ఇది ఇప్పుడు బయటకు రావడంతో బిజెపి తీవ్ర ఇరకాటంలో పడింది. ముందే తెలిసినా బిజెపి నేతలు దీనిపై నోరుమెదపకపోవడం ప్రజ్వల్‌ దుశ్యర్యలకు మద్దతు ఇవ్వడమేనని ఐద్వా విమర్శించింది.జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఐద్వా పేర్కొంది. ప్రజ్వల్‌ను వెంటనే స్వదేశానికి తీసుకొచ్చి, అతడిపైన, అతని తండ్రి హెచ్‌ డి రేవణ్ణ పైనా సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. లైంగిక నేరస్థులకు ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇవ్వవద్దని కోరింది.

➡️