శాంతిభద్రతలు రాష్ట్ర అంశం

May 2,2024 23:58 #supreem court
  •  పశ్చిమ బెంగాల్‌ పిటీషన్‌ విచారణలో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నేరం చేస్తే.. ఆ కేసును కేవలం సిబిఐతో మాత్రమే దర్యాప్తు చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్మీ క్యాంప్‌లోని సైనికులు ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు అధికారులు వారిని స్థానిక పోలీసులకే అప్పగిస్తారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 కింద పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను గురువారం జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరుపున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అనేక కేసులను విచారిస్తుందని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుందని తెలిపారు.
ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ (డిఎస్‌పిఇ) చట్టంలోని సెక్షన్‌ 6 కింద 2018 నంబర్‌ 16న పశ్చిమ బెంగాల్‌ భూభాగంలో సిబిఐ దర్యాప్తునకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తన ముందస్తు అనుమతి ఉపసంహరించుకున్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి కపిల్‌ సిబాల్‌ తీసుకుని వెళ్లారు. ‘వారి (కేంద్రం) ఉద్దేశ్యం సిబిఐ ద్వారా రాష్ట్రంలో ప్రవేశించి, ఆ తరువాత ఇడిని ఉపయోగించుకుని, ఆపై ఏమి చేయాలో అది చేయడమే’ అని కపిల్‌ సిబాల్‌ వాదించారు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ పిటీషన్‌కు అసలు విచారణ అర్హత లేదని, కొట్టివేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదికి వాయిదా వేసింది.

➡️