2029లో జమిలి ఎన్నికలకు లా ప్యానెల్‌ ప్రతిపాదన..? 

Feb 29,2024 09:21 #Jamili Elections
  • శాసన సభల నిబంధనలను ”మూడు దశల్లో” మార్పు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించి, 2029 నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్‌ సిఫారసు చేసినట్లు వార్తలొస్తున్నాయి. జస్టిస్‌ (రిటైర్డ్‌) రీతు రాజ్‌ అవస్తీ ఆధ్వర్యంలోని కమిషన్‌, ఏకకాల ఎన్నికలపై ”కొత్త అధ్యాయం, భాగాన్ని” జోడించడానికి రాజ్యాంగంలో సవరణను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో మొదటి ‘జమిలి’ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో శాసన సభల నిబంధనలను ”మూడు దశల్లో” సమకాలీకరించాలని కూడా ప్యానెల్‌ సిఫారసు చేస్తోందని సమాచారం. లా కమిషన్‌తో పాటు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చడంతో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చనే దానిపై నివేదికను రూపొందిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, కనీసం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానా, జార?ండ్‌ రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది బీహార్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ 2026లోనూ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌లకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ వంటి తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చు.

 

➡️