జిల్లా, మండల స్థాయిల్లో మహా పంచాయత్‌లు

  • 14న ఢిల్లీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌పై ఇంటింటి ప్రచారం
  • అజయ్ మిశ్రాకు ఎంపి సీటును నిరసిస్తూ టార్చ్‌ లైట్‌ ప్రదర్శనలు
  • 8న మహిళా సంఘాలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీలో ఈ నెల 14న జరిగే కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌కి ముందు దేశవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయిల్లో మహా పంచాయత్‌లు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరీ లోక్‌సభ సీటు లఖింపూర్‌ ఖేరీ రైతుల ఊచకోత కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా తండ్రి అజరు మిశ్రాకు బిజెపి ఇవ్వడాన్ని ఎస్‌కెఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2021 అక్టోబర్‌ 3న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్‌మిశ్రా, అతని అనుచరులు వాహనాలు ఎక్కించి క్రూరంగా దాడి చేశారు. దీంతో, రైతులు నక్షత్ర సింగ్‌, లవ్జీత్‌ సింగ్‌, దల్జీత్‌ సింగ్‌, గుర్విందర్‌ సింగ్‌, జర్నలిస్ట్‌ రామన్‌ కశ్యప్‌ మరణించారని గుర్తు చేసింది. సెక్షన్‌ 102 ఐపిసి కింద అజరు మిశ్రాను తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలని, శిక్షను నిర్ధారించాలని రైతుల ఉద్యమం డిమాండ్‌ చేసిందని తెలిపింది. మోడీ ప్రభుత్వం ఆయనను కాపాడుతోందని, సుప్రీం కోర్ట్‌ జోక్యం తర్వాత, ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాను అరెస్టు చేశారని తెలిపింది. గత పదేళ్లలో ప్రజల జీవనోపాధిని అణిచివేస్తున్న కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు చేపట్టిన ప్రజా ఆందోళనను అణిచివేసేందుకు బిజెపి ధనబలం, కండబలాన్ని ప్రయోగించింది. కార్పొరేట్‌ – అవినీతి ధన బలంతో అసమ్మతిని తగ్గించడానికి, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు, కార్పొరేట్‌ ప్రాయోజిత మీడియాను ఉపయోగించి ప్రధాని మోడీ గ్రాఫ్‌ పెంచే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. అజరుమిశ్రా అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా, మోడీ హయాంలో కార్పొరేట్‌-నేరసంబంధమైన బంధాన్ని బహిర్గతం చేయడానికి దేశవ్యాప్తంగా గ్రామాలలో టార్చ్‌ లైట్‌ ప్రదర్శన నిర్వహించాలని ఎస్‌కెఎం రైతులకు పిలుపునిచ్చింది. నిరసన తేదీని ఎస్‌కెఎం సంబంధిత రాష్ట్ర సమన్వయ కమిటీలు నిర్ణయిస్తాయని తెలిపింది. రాంలీలా మైదాన్‌లో ఈనెల 14న జరగనున్న కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌లో కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, ఇతర వర్గాల ప్రజా సంఘాలతో ఎస్‌కెఎం కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపింది. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి రైతులు రాంలీలా మైదాన్‌కు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. ఈ కాలంలో సుదూర రాష్ట్రాల రాష్ట్ర సమన్వయ కమిటీలు పాదయాత్ర, ఇంటింటి ప్రచారం, జిల్లా, మండల స్థాయి మహా పంచాయత్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (బిఐఎఫ్‌ఎఫ్‌)లో కేసరి హరవు దర్శకత్వం వహించిన ఢిల్లీ సరిహద్దుల్లో 2020-21 చారిత్రాత్మక రైతుల పోరాటంపై కిసాన్‌ సత్యాగ్రహ చిత్రంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధాన్ని ఎస్‌కెఎం తీవ్రంగా ఖండించింది. ఎస్‌కెఎం దీనిని రాజ్యాంగంలో పొందుపరిచిన భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను నిరాకరించే నిరంకుశ చర్యగా పరిగణిస్తుందని తెలిపింది. నిషేధాన్ని వీలైనంత త్వరగా ఎత్తివేయాలని మోడీ ప్రభుత్వాన్ని ఎస్‌కెఎం డిమాండ్‌ చేసింది. మహిళా సంఘాలు, ఇతర బహుజన సంఘాలతో సమన్వయం చేసు కుంటూ ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని దేశవ్యాప్తంగా రైతులకు ఎస్‌కెఎం పిలుపుని చ్చింది. మహిళా రైతులందరికీ ఎస్‌కెఎం శుభాకాంక్షలు తెలియజేసింది. మహిళల విముక్తి కోసం పని చేయడానికి, మహిళలపై అన్ని రకాల అఘాయిత్యాలు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేసింది.

మహా పంచాయతీలో వ్యవసాయ కార్మిక సంఘాలు

ఈ నెల 14న ఢిల్లీలో జరిగే కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌లో వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొనున్నాయి. ఈ మేరకు సోమవారం బి.వెంకట్‌ (ఎఐఎడబ్ల్యుయు), గుల్జార్‌ సింగ్‌ గోరియా (బికెఎంయు), అసిత్‌ గంగూలీ (ఎఐఎస్‌కెఎస్‌), ధీరేందర్‌ ఝా (ఎఐఎఆర్‌ఎల్‌ఎ), ధర్మేందర్‌ ( ఎఐఎకెఎస్‌యు) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయతీలో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు భారీ స్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️