మహారాష్ట్రలో ముగిసిన సీట్ల సర్దుబాటు ..

 ముంబయి :    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్రలో ప్రతిపక్షాల కూటమి మహావికాస్‌ అఘాడీ (ఎంవిఎస్‌)లో శుక్రవారం సీట్ల సర్దుబాటు ముగిసింది.  మొత్తం 48 లోక్‌సభ స్థానాలకుగానూ ఉద్ధవ్‌ థాకరే శివసేన (యుబిటి) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 18, ఎన్‌సిపిలు 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. ఈ మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

8 సీట్ల విషయంలో నెలకొన్నసందిగ్థత ప్రస్తుతం  తొలగిపోయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో నాలుగు చోట్ల శివసేన(యుబిటి) పోటీ పడనుందని తెలుస్తోంది. కాగా, ఎంవిఎ మిత్రపక్షమైన వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (విబిఎ) రెండు స్థానాల్లో పోటీ పడనుంది. ఉద్ధవ్‌ థాకరే పార్టీ నుండి రెండు సీట్లు వెళ్లనున్నట్లు సమాచారం. బహుశా ముంబయి నార్త్‌ ఈస్ట్‌ సీటును విబిఎకి ఇవ్వవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్‌సిపి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో శివసేన (షిండే వర్గం చీలక ముందు) 23 స్థానాల్లో పోటీ చేసింది. ముంబయి సౌత్‌ సెంట్రల్‌ మరియు నార్త్‌ వెస్ట్‌ సహా 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ 25 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ .. చంద్రాపూర్‌ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఎన్‌సిపి (అజిత్‌ పవార్‌ వర్గం చీలక ముందు) 19 స్థానాలకు గాను నాలుగు స్థానాలను గెలుచుకుంది.

➡️