ఇసి తీరు విస్మయకరం – మల్లికార్జున ఖర్గే

May 12,2024 08:27 #Amazing, #EC, #mallikarjuna kharge

న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్‌ నేతలకు తాను రాసిన లేఖపై ఆఘమేఘాలపై ఇసి స్పందించిందని, అయితే మత విద్వేష ప్రసంగాలు, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కే తాను నేరుగా చేసిన ఫిర్యాదులపై మాత్రం ఇసి స్పందించలేకపోయిందని, ఇది విస్మయకరమని ఆయన అన్నారు. మతోన్మాదాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టేలా బిజెపికి చెందిన పలువురు నేతలు చేస్తున్న దారుణమైన ప్రకటనలపై దృష్టిసారించడంలో ఇసి తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు, ఇతర ఎన్నికల కమిషనర్లకు శనివారం ఆయన లేఖ రాశారు. నేరుగా ఎన్నికల కమిషన్‌కే అనేక ఫిర్యాదులను చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ‘ఇండియా’ నేతలకు రాసిన లేఖపై మాత్రం ఇసి స్పందించడం వింతగా అనిపించిందని ఆయన తాజా లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో భాషకు సంబంధించి కొన్ని సందేహాలు వుండవచ్చు, కానీ దానిపై నేను పట్టుబట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే వారెలాంటి ఒత్తిళ్ల కింద పనిచేస్తున్నారో నాకు అర్ధమవుతోందని ఖర్గే ఆ లేఖలో పేర్నొన్నారు. ప్రశ్నలు అడిగేందుకు పౌరులకు గల హక్కును కమిషన్‌ గౌరవిస్తుందని అంటూనే జాగ్రత్తగా ఉండాలంటూ సలహా రూపంలో పౌరులను ఇసి బెదిరిస్తోందని..తనకు ఇసి రాసిన లేఖలో పేర్కొన్న వివరాలను ఖర్గే వెల్లడించారు. వాస్తవమే అయినప్పటికీ, ఒక నియోజకవర్గం లేదా రాష్ట్రం స్థాయిలో మొత్తంగా ఓటర్ల పోలింగ్‌ డేటాను ప్రచురించాలన్న చట్టబద్ధమైన బాధ్యత కమిషన్‌కు లేదని ఎన్నికల సంఘమే చెప్పడం తనను విస్తుపోయేలా చేసిందని ఖర్గే తెలిపారు.

➡️