ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌పై మమతా అసత్య ప్రచారం

May 20,2024 00:05 #Mamata Banerjee

కోల్‌కతా: ముస్లింలు, చొరబాటుదారులను రక్షించడానికే ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ వంటి సంస్థలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. బెంగాల్‌లో వరసగా రెండో రోజూ కూడా మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం పశ్చిమ మిద్నాపూర్‌ జిల్లాలోని ఖరగ్‌పూర్‌లో మోడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బెంగాల్‌ సంస్కృతిని, వారసత్వాన్ని టిఎంసి అవమానిస్తోందని విమర్శించారు. అయోధ్యలో రామమందిరానికి వ్యతిరేకంగా టిఎంసి నాయకులు పదేపదే అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు.
ముస్లిం ఓట్ల కోసం మాత్రమే వారు ఈవిధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చొరబాటుదారులతో బెంగాల్‌కు భారీ ముప్పు పొంచి ఉందని అన్నారు. ‘చొరబాట్లు జనాభాలో సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలుగా మారారు. ఎస్‌టి,ఎస్‌సి భూములను చొరబాటుదారులు కబ్జా చేస్తున్నారు. మన సోదరీమణులు, కుమార్తెల భద్రత ప్రమాదంలో పడింది’ అని మోడీ చెప్పారు. కాగా, శనివారం మోడీ హుగ్లీ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు.

➡️