మోడీనా.. మతోన్మాదినా..!

Apr 24,2024 10:25 #Brinda Karat, #coments, #PM Modi
brinda karat on kerala governor

ప్రధాని నుంచి ఆ మాటలు ఊహించలేదు
ఆ పదవికి అనర్హుడు
చర్యలు చేపట్టడంలో ఇసి విఫలం
సిపిఎం నేత బృందాకరత్‌
తిరువనంతపురం : రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగించిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ తెలిపారు. మోడీ వ్యాఖ్యల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టని ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతను ఆమె ప్రశ్నించారు. మతపరమైన శతృత్వాన్ని ప్రేరేపించడం, విద్వేష ప్రసంగం చేయడం వంటి చర్యలకు భారతీయ చట్టాలు వ్యతిరేకమని అంటూ మోడీ మాటలు ఆ చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని విమర్శించారు. ‘ప్రధానమంత్రి దేశ పౌరుడు. ఆయన దేశంలోని ఇతర పౌరుల కంటే ఎక్కువేమీ కాదు. దేశ చట్టాలకు అతీతుడు కూడా కాదు. భారత చట్టాలను ప్రధాని అంగీకరించాల్సి ఉంటుంది. మతాల మధ్య శతృత్వాన్ని పెంచడాన్ని మన చట్టాలు వ్యతిరేకిస్తున్నాయి. మతాల మధ్య విద్వేషాలను వ్యాపింపజేయడాన్ని కూడా అవి వ్యతిరేకిస్తున్నాయి. అలాంటి చట్టాలను ప్రధానమంత్రి ఉల్లంఘించినప్పుడు ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని తిరువనంతపురంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బృందా కరత్‌ చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ పాత్ర పూర్తిగా దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నదని, ప్రధానిపై చర్య తీసుకోకపోతే దాని విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించారు. భారత్‌ వంటి లౌకికదేశానికి నాయకుడైన ప్రధాని అలా ప్రసంగించడం ఊహించలేదని వ్యాఖ్యానించారు. ‘ప్రధాని నుంచి వచ్చింది దిగ్భ్రాంతికరమైన ప్రకటనే. భారత్‌ వంటి లౌకిక దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నుంచి అలాంటి మాటలు రావడం అనూహ్యం. నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆయన ఓ మతోన్మాదిలా మాట్లాడారు. ఆయన భారత ప్రధాని పదవికి అనర్హుడు. ఈ ఎన్నికలలో అలాంటి భాషను ఉపయోగించడం విద్వేష ప్రసంగమే అవుతుంది’ అని బృందాకరత్‌ చెప్పారు. మోడీ ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఎన్నికల సీజన్‌లో ఓట్లను సమీకరించేందుకు విద్వేష ప్రసంగం చేస్తున్నారని ఆరోపించారు.
విద్వేష ప్రసంగం, మత హింసకు సంబంధించిన ఐపిసి సెక్షన్లను ఉదహరిస్తూ ప్రధాని మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేశానని బృందాకరత్‌ తెలిపారు. తన ఫిర్యాదును స్వీకరించేందుకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిరాకరించారని, దాంతో దానిని నేరుగా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు పంపాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

➡️