మోడీ సర్కార్‌ ఉలికిపాటు : రాజధానిలో నిరసన గళం విప్పిన కర్ణాటక, కేరళ

Feb 14,2024 10:49

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ‘నా పన్ను…నా హక్కు’ పేరుతో కర్నాటక ప్రభుత్వం దేశ రాజధానిలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని నింపింది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కేంద్రంపై బాహాటంగా గొంతు విప్పుతున్నాయి. మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మందిరం, మతోన్మాద జాతీయోన్మాదం, దేశభక్తి వంటి భావోద్వేగపూరితమైన అంశాలనే పట్టుకొని వేళ్లాడుతోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. దీనికి ప్రతిఘటన కూడా అదే స్థాయిలో ఎదురవుతున్నది. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వచ్చి రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తగా.. ఆ మరునాడే కేరళకు చెందిన వామపక్ష నేతలు ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన బెంగళూరు రూరల్‌ ఎంపీ, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు.

కర్ణాటక ‘ఛలో ఢిల్లీ’

                  దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచారు. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన ఫార్ములా ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో కర్నాటక రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయిందని వారు వివరించారు. రాష్ట్రం వసూలు చేస్తున్న ప్రతి వంద రూపాయల పన్నులో కేవలం రూ.13 రూపాయలే తిరిగి రాష్ట్రానికి దక్కుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర తర్వాత దేశంలో రెండో అతి పెద్ద పన్ను చెల్లింపుదారు అయిన కర్నాటక అందుకు తగిన ప్రతిఫలం పొందలేకపోతోందని సిద్ధరామయ్య వాపోయారు.

కేరళ సైతం…

                    జంతర్‌మంతర్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలను దునుమాడారు. జిఎస్‌టి పరిహారం ఆగిపోవడం, పన్నుల్లో వాటా కుదించడం, రుణాలకు అనుమతి నిరాకరించడం వల్ల రాష్ట్రం రూ.57,000 కోట్లు నష్టపోయిందని ఆయన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, సిపిఐ నేత డి రాజా తదితరులు మోడీ ప్రభుత్వాన్ని, నిరంకుశ విధానాలను తిప్పికొట్టారు. విదేశీ పర్యటన కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హాజరుకాలేకపోయినా, ఈ ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సందేశాన్ని పంపారు. కార్యక్రమానికి తన క్యాబినెట్‌ సహచరుడు పీటీ రాజన్‌ను పంపారు. కేంద్ర వివక్షతపై ఒకవైపు రాజకీయంగానే పోరాడుతూనే మరోవైపు న్యాయ పోరాటాన్ని కూడా కేరళ చేస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లోని నిధులను కేంద్రం వెంటనే విడుదల చేసేలా చూడాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ కూడా…

             తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కేంద్ర నిరంకుశ ధోరణిపై గళమెత్తింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో అన్ని పక్షాలకూ సూచించారు.

రాష్ట్రాలు ఏం కోరుతున్నాయి ?

                  ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నది ఒక్కటే. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని మాత్రమే కోరుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా (ఆదాయ వ్యత్యాసానికి 45%, జనాభాకు 15%, విస్తీర్ణానికి 15%, అడవులు-జీవావరణానికి 10%, జనాభా పనితీరుకు 12.5%, పన్ను ప్రయత్నాలకు 2.5%) బకాయిలు చెల్లించాలని అడుగుతున్నాయి. జరిమానాలు విధించడం లేదా తమకు రావాల్సిన నిధులను ఇవ్వకపోవడం ద్వారా కేంద్రం తమ చేతులు కట్టేస్తోందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి.

➡️