అమ్మా.. నాన్న.. క్షమించండి : ఇదే నాకు చివరి ఆప్షన్‌

Jan 30,2024 11:35 #jaipur, #student, #Suicide
  • కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం
  • ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య

జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటాలోని బోర్ఖెడ ప్రాంతానికి చెందిన నిహారికా సింగ్‌ (18).. జెఇఇ కోసం సన్నద్ధమవుతున్నది. జెఇఇ సాధించలేనని, పరీక్షల్లో మంచి మార్కులు పొందలేనని భావించి, తన ఇంటిలో ఉరేసుకున్నది. ఇది గమనించిన బాధితురాలి కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిహారికా అప్పటికే ప్రాణాలు వదిలిందని వైద్యులు ప్రకటించారు. ఆత్మహత్యకు ముందు నిహారిక సూసైడ్‌ నోట్‌ను సైతం రాసింది. ”అమ్మా, నాన్న.. నేను జెఇఇ చేయలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ఓడిపోయాను. నన్ను క్షమించిండి అమ్మా.. నాన్న. ఇదే నాకున్న చివరి ఆప్షన్‌” అని ఆ లేఖలో పేర్కొన్నది. ఈ ఆత్మహత్యపై దర్యాప్తు జరుపుతున్నామనీ, నిహారిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవటానికి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గత వారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి కోటలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోటాలో 2023లో 27 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక్కడ ఉన్న వివిధ శిక్షణా కేంద్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు వస్తుంటారు.

➡️