అత్యధికులు కోటీశ్వరులే!

  • వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో 94 శాతం, బిజెపి 80 శాతం, జనసేన 86 శాతం
  • 23 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు – ఎడిఆర్‌ రిపోర్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న అధికారం వైసిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల్లో 94 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. 23 శాతం మంది క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) రిపోర్టు విడుదల చేసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 2,368 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 604 మంది (26 శాతం) కోటీశ్వరులు ఉన్నారు.
175 మంది వైసిపి అభ్యర్థుల్లో 165 (94 శాతం) మంది, 143 మంది టిడిపి అభ్యర్థుల్లో 134 (94 శాతం) మంది, 21 మంది జనసేన అభ్యర్థుల్లో 18 (86 శాతం) మంది, 10 మంది బిజెపి అభ్యర్థుల్లో 8 (80 శాతం) మంది, 158 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 79 (50 శాతం) మంది కోటి రూపాయలకు పైబడి ఆస్తులను ప్రకటించారు.

23 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు
543 (23 శాతం) మంది క్రిమినల్‌ కేసులు ఉన్నవారు పోటీ చేస్తున్నారు. 2019లో 331 (17 శాతం) మంది క్రిమినల్‌ కేసులు ఉన్నవారు పోటీ చేశారు. 374 (16 శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నవారు పోటీ చేస్తున్నారు. 2019లో 220 (11 శాతం) మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు పోటీ చేశారు.
175 మంది వైసిపి అభ్యర్థుల్లో 87 (50 శాతం) మంది, 143 మంది టిడిపి అభ్యర్థుల్లో 119 (83 శాతం) మంది, 10 మంది బిజెపి అభ్యర్థుల్లో 8 (80 శాతం) మంది, 158 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 42 (27 శాతం) మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. 89 మంది అభ్యర్థులు మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. నలుగురు అభ్యర్థులు అత్యాచార కేసులు ఎదుర్కొంటున్నారు. పదహారు మంది అభ్యర్థులు హత్య కేసులు ఎదుర్కొంటున్నారు.

➡️