ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

లక్నో : సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబం నుంచి కొత్త నాయకురాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరినీ ఆకర్షిస్తున్నారు. ములాయం కుమారుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తె అదితి తన ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె తన తల్లి డింపుల్‌తో కలిసి బీవర్‌ ప్రాంతంలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటోంది. చిన్నవయస్సు నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకుంటోందని ఆమెను చూసిన వారు భావిస్తున్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ మరణానంతరం మొయిన్‌పురి లోక్‌సభ నుంచి డింపుల్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. 1996 నుంచి ఈ స్థానంలో ములాయం కుటుంబానికి ఓటమి లేదు. తొలితరం ములాయం సింగ్‌తో పాటు ఆయన సోదరులు శివపాల్‌ సింగ్‌, రామ్‌ గోపాల్‌సింగ్‌ యాదవ్‌లు రాజకీయాల్లో ఉండగా, రెండో తరం ములాయం సింగ్‌ కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ కోడలు డింపుల్‌, మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్‌ రాజకీయాల్లోనే ఉన్నారు. మూడోతరం మనువడు తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ యాదవ్‌ 2014 ఉప ఎన్నికల్లో మెయిన్‌పురి నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు తాజాగా మనవరాలు అదితి కూడా రాజకీయ పాఠాలు నేర్చుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

➡️