President: ధరలు, నిరుద్యోగం ఊసే లేదు

Jun 28,2024 08:05 #be punished, #NEET convicts

పాత పాటగా రాష్ట్రపతి ప్రసంగం – సిఎఎకు సమర్ధన
నీట్‌ దోషులను శిక్షిస్తామని హామీ – బహిష్కరించిన ఆప్‌ ఎంపీిలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గురువారం చేసిన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా సాగింది. కొత్త ప్రభుత్వ విధానాలను మార్గనిర్దేశం చేసేలా ఉండాల్సిన ఈ ప్రసంగంలో నీట్‌ దోషులను శిక్షిస్తామనడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. గత ఐదేళ్లుగా చెప్పినవే, మళ్లీ ఉద్ఘాటించారు. అధిక ధరలు, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి వాటి గురించి ప్రస్తావించకుండా తన ప్రభుత్వ సుపరిపాలన గురించి గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో చర్చనీయాంశమైన అగ్ని పథ్‌ గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. పార్లమెంటు సక్రమంగా పని చేస్తే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, అప్పుడు ప్రభుత్వంపైనే కాకుండా యావత్‌ పార్లమెంటరీ వ్యవస్థపై కూడా విశ్వాసం ఉంటుందని, దేశ ప్రజల ఆకాంక్షలను పార్లమెంటు నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. కానీ, 17వ లోక్‌సభలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అనుమతించలేదనే విషయం ఆమెకు తెలియదని అనుకోలేము. ఎలాంటి చర్చ లేకుండా ఒకదాని తరువాత ఒక బిల్లును గిలెటెన్‌ చేసింది. ఒక దశలో రాహుల్‌ గాంధీ ఎంపీ పదవిని రద్దు చేసింది. సమావేశాల్లో హోం మంత్రి వివరణ కోరినందుకు 140 మంది ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఇదంతా మరచిపోయి పార్లమెంటు సక్రమంగా జరగాలని హితోపదేశం చేశారు.
నీట్‌పై ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చకు నోటీసులిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ”ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ నియామకాల్లో పారదర్శకత చాలా అవసరం. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ముక్తాయించారు. ఈ అభిల భారత ప్రవేశ పరీక్షలో అవినీతిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ప్రధానమంత్రి నుంచి కానీ, విద్యా మంత్రి నుంచి కానీ అలాంటిి ప్రకటన లేదు. ఎన్‌టిఎ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తే దానిపై ఎలాంటి చర్యలు లేవు. బిజెపి ఎంపీ మాదిరిగా 1975 ఎమర్జెన్సీ గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత పదేళ్లుగా దేశంలో మోడీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తోందన్నది మరచిపోయారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు తగ్గాయని ఇది ప్రభుత్వ గొప్పతనంగా రాష్ట్ర పని పేర్కొన్నారు. నిజానికి అవి తగ్గలేదు. బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి తగ్గినట్టుగా చూపారు. వివక్షాపూరితమైన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. మత పరంగా వివక్ష చూపుతున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా ఆందోళనలు సాగితే దాని గురించి ప్రస్తావించకుండా విదేశాల నుంచి వచ్చే శరణార్థులకు హుందాగా జీవించేందుకు ఇది ఉపయోగపడుతుందని రాష్ట్రపతి సెలవిచ్చారు.
మహిళా సాధికారతకు ‘నారీ శక్తి వందన్‌ అధిరనయం’ ఎంతగానో తోడ్పడుతోందని, అలాగే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పథకాలు చాలా వరకు ప్రచారానికే పరిమితమయ్యాయి. ఆరెస్సెస్‌ డ్రీమ్‌ ప్రాజెక్టుల్లో ఒకటి అయిన ప్రకృతి సేద్యాన్ని గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రత్యేకించి ప్రస్తావించారు. గ్లోబల్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నందున ఆర్గానిక్‌ పంటలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. శ్రీలంకలో దారుణ ఆహార సంక్షోభానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఈ ప్రకృతి సేద్యం అన్న విషయం మరచిపోరాదు. తొలుత రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు రాజ దండంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమెతో కలిసి సభ లోపలికి వెళ్లారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపిలుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సిఎఎ ప్రకారం శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేయడం ప్రారంభించిందని అన్నారు. జులై ఒకటి నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలు అమలులోకి రానున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రతి ప్రయత్నాన్నీ ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జమ్ముకాశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో కాశ్మీర్‌ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్దయెత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషమని అన్నారు.
‘మన దేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవి. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఇసికి అభినందనలు. ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారు. ప్రభుత్వ సుస్థిరత, నిజాయతీని నమ్మారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది.’ అని రాష్ట్రపతి అన్నారు.
గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద పేదలకు ఉచితంగా రేషన్‌ సరఫరా చేస్తున్నామని, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయుష్మాన్‌ భారత్‌ అనేది గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తోందని అన్నారు. ‘వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. అన్ని రంగాల్లో భారత్‌ బలంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం కృషి చేస్తోంది. సర్వీస్‌ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోంది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.’ అని వివరించారు.

బహిష్కరించిన ఆప్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. ఆప్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్‌ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ‘ఇడి, సిబిఐల దుర్వినియోగాన్ని అరికట్టాలి, కేజ్రీవాల్‌ను విడిచిపెట్టాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

నీట్‌పై నేడు వాయిదా తీర్మానం
నీట్‌ వ్యవహారంపై పార్లమెంట్‌లో శుక్రవారం ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. శుక్రవారం వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించాయి. గురువారం రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా ఫోరం నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీట్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

➡️