Assam: అసోంలో మార్క్‌షీట్‌ స్కామ్‌

గౌహతి వర్శిటీలో కొందరు విద్యార్థుల మార్కుల పెంపు
ముగ్గురు ప్రభుత్వ అధికారులుసహా పదిమంది అరెస్టు
న్యూఢిల్లీ : నీట్‌ స్కామ్‌ మరువక ముందే అస్సాంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో మరో స్కాం వెలుగుచూసింది. గౌహతి యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్ష పేపర్లలో మార్కులను మార్పు చేసి, ఎక్కువ మార్కులు నమోదు చేస్తూ.. పెద్దమొత్తంలో నగదు గుంజుతున్నారని వెల్లడైంది. ఒక పేపరులో మార్కులు పెంచడానికి రూ.16 వేలు, ఒక సెమిస్టర్‌లోని అన్ని పేపర్లలో మార్కులు మార్పు చేసేందుకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఈ స్కామ్‌లో ఇప్పటివరకూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సహా పదిమందిని అరెస్టు చేసినట్లు సిఐడి, అస్సాం పోలీసులు ఆదివారం తెలిపారు. యూనివర్శిటీలోని వివిధ విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు ఈ మోసాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు చెప్పారు. యూనివర్శిటీలో ఏజెంట్లను పెట్టారని, వారు విద్యార్థులతో మాట్లాడతారని, ఎక్కువ మార్కులకు ఎక్కువ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని వివరించారు. బార్‌పేటలో ఆరు కేసులు వెలుగు చూశాయని, అదే ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి ప్రధాన నిందితుడిని, అతనిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. గౌహతి విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్‌ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐయుఎంఎస్‌)ని థర్డ్‌పార్టీకి ఆపరేటర్‌కి అవుట్‌ సోర్స్‌ కింద ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటిఐ లిమిటెడ్‌ అనేది డేటా ఎంట్రీ బాధ్యత వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తాజాగా అరెస్టు చేసిన పదో నిందితుడు అడ్వకేట్‌ అని, అతనిని ఇంటరాగేట్‌ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

➡️