బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు – తొమ్మిది మంది మృతి

May 9,2024 23:52 #Explosion, #Fireworks Factory

శివకాశి : తమిళనాడులోని శివకాశీలో ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మధ్యహ్నం సుదర్శన్‌ ఫైర్‌వర్క్స్‌ యూనిట్‌లో ఈ పేలుడు జరిగింది. పేలుడు వార్త తెలియగానే శివకాశీ, విరుధునగర్‌ నుంచి వచ్చిన మూడు అగ్ని మాపక యంత్రాలు సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చాయి. ఈ పేలుడులో ఒక కార్మికుడు గల్లంతయ్యాడనే అనుమానంతో ఆయన కోసం శిథిలాల మధ్య పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నైపుణ్యం లేని కార్మికులు సున్నితమైన రసాయనాల మిశ్రమాలను కలుపుతుండగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 100 కార్మికులు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేగంగా సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని, క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి రాగానే బాధితులందరికీ ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

➡️