మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదు : ఖర్గే

 న్యూఢిల్లీ :    మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడం లేదని మండిపడ్డారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుకు ఇప్పట్లో అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలతో ఎటువంటి చర్చలు జరగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈవార్తలపై ఖర్గే స్పందించారు.

19 నెలల్లో క్రూడ్‌ ఆయిల్‌ ధర 39శాతం తగ్గిందంటూ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాన్ని పోస్ట్‌ చేశారు. అయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో తగ్గింపు లేదని దుయ్యబట్టారు.

‘క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ధరలు తగ్గించే విషయంపై ఆయిల్‌ కంపెనీలతో చర్చలు జరపలేదని కేంద్ర మంత్రులే చెబుతున్నారు. ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌పై రూ.8 నుంచి రూ.10, డీజిల్‌పై రూ.3 నుంచి రూ.4 లాభం పొందుతున్నాయి’ అని ఖర్గే పేర్కొన్నారు.

➡️