మోడీ సహా బిజెపి నేతలపై చర్చలేవీ ?

May 12,2024 00:18 #modi, #speech

– ఇసి నిష్క్రియాపరత్వంపై రేగిన నిరసనలు
– దేశవ్యాప్తంగా ప్రచారాలు
– ఇసికి ప్రముఖులు, పౌర సమాజ సంస్థల లేఖ
బెంగళూరు : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు జరుగుతున్నా, విద్వేష ప్రసంగాలు కొనసాగుతున్నా ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ‘గ్రో ఎ స్పైన్‌ ఆర్‌ రిజైన్‌’ (వెన్నుచూపకుండా నిలబడు..లేదా రాజీనామా చేసి వైదొలుగు) నినాదంతో పౌర సమాజ సంస్థలు సంయుక్త ప్రచారాన్ని చేపట్టాయి. నిరసనలు తెలియచేశాయి. 96 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా ప్రధాని నరేంద్ర మోడీని నిషేధించాలని, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశాయి. కర్ణాటకలో సివిల్‌ సొసైటీ కార్యకర్తలు రాష్ట్ర చీఫ్‌ ఎన్నికల అధికారి (సిఇఓ) కార్యాలయానికి వెళ్లి మెమోరాండం అందచేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను, చట్టాలను ఉల్లంఘిస్తున్నా ఏమీ పట్టనట్లుగా, నిష్క్రియాపరంగా వ్యవహరిస్తున్నందుకు భారత ఎన్నికల కమిషన్‌ను జవాబుదారీ చేయాలని వారు కోరారు.
కర్ణాటకలో, ముస్లిం రిజర్వేషన్‌పై బిజెపి యానిమేటెడ్‌ వీడియో క్లిప్‌ గురించి తాము సిఇఓకు ఫిర్యాదు చేశామని బహుత్వ కర్ణాటక సభ్యుడు వినరు శ్రీనివాస చెప్పారు. తక్షణమే ఈ వీడియోను తొలగించాలని డిమాండ్‌ చేశామన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా, కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఆ వీడియోను తొలగించారన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు బిజెపి నేతలు అనేకసార్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని, వాటిని ఇసి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సోషల్‌ మీడియాలో ఇలాంటివేవీ పోస్టు చేయకుండా బిజెపి కర్ణాటక హ్యాండిల్‌ను నిలువరించాలన్నారు. కానీ తాము చేసిన డిమాండ్లలో ఏ ఒక్కదాన్ని కూడా పట్టించుకోలేదని వినరు పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్షాలు పాల్పడిన కోడ్‌ ఉల్లంఘనల గురించి మాత్రమే ఇసి పట్టించుకుంటోందని ఆయన విమర్శించారు. పాలక పార్టీని స్వేచ్ఛగా వదిలివేసిందన్నారు. కోడ్‌ను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్‌కి చెందిన రణదీప్‌ సూర్జివాలా, బిఆర్‌ఎస్‌కి చెందిన కెసిఆర్‌లను 48గంటల పాటు ప్రచారం చేయరాదని నిషేధించిందని గుర్తు చేశారు. కానీ బిజెపి అంతకన్నా ఎక్కువే ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
సంయుక్త ఫిర్యాదు, పోస్టుకార్డుల ఉద్యమం
అహ్మదాబాద్‌, ముంబయి, హైదరాబాద్‌ తదితర నగరాల్లో చీఫ్‌ ఎన్నికల అధికారి కార్యాలయాలకు వెళ్ళి సంయుక్త ఫిర్యాదులు అందచేశారు. ఢిల్లీ చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి వెళ్ళి లేఖ కూడా అందచేశారు. పౌర సమాజ సంస్థలు ఈ విధంగా సమిష్టిగా ఆందోళన చేపట్టగా, పౌరులు పోస్ట్‌ కార్డ్‌ ఉద్యమం చేపట్టారు. వెన్నెముక బమ్మతో వివిధ నగరాల నుండి ఇసికి వందలాది పోస్టుకార్డులను పంపారు.
పోలింగ్‌ శాతాన్ని కేవలం శాతాల్లోనే చెప్పారు కానీ పోలైన ఓట్లను వెల్లడించలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఓట్ల లెక్కింపులో అవకతవకలు పాల్పడే అవకాశాలు వున్నాయనే అందోళనలు పెరుగుతున్నాయన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసాలు వున్నట్లు వార్తలు వచ్చాయి. 373 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపించింది. కాంచీపురంలో 18 వేలు, శ్రీపెరంబదూర్‌లో 14512 ఓట్లు తేడా వచ్చాయి. కానీ ఇసి ఇంతవరకు ఆ తేడాకు వివరణ ఇవ్వలేదని ఆ లేఖ పేర్కొంది. ఈసారి కూడా పోలైన ఓట్ల డేటాను ప్రచురించడానికి నిరాకరిస్తోంది. దీనివల్ల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు దారి తీస్తాయన్న ఆందోలను తలెత్తుతున్నాయి లేఖ పేర్కొంది.
విద్వేష ప్రసంగాలు
మత ప్రాతిపదికన కమ్యూనిటీల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఇప్పటికే ప్రధాని అనేక చోట్ల ప్రసంగించారు. ఇది ఎన్నికల కోడ్‌, ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే. రాజకీయ పార్టీలకు ఇసి జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పెడచెవిన పెట్టడమే అవుతుందని ఇసికి రాసిన ఆ లేఖ పేర్కొంది. ఇప్పటివరకు ప్రధాని మోడీకి ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, అలాగే, విద్వేషాలను రెచ్చగొట్టేలా బిజెపి అనేక వీడియోలు విడుదల చేసిందని పేర్కొంది. ప్రతిపక్షాల మేనిఫెస్టోలను వక్రీకరించేలా బిజెపి అనేకసార్లు మాట్లాడిందని, కానీ ఇంతవరకు చర్య లేదని లేఖ పేర్కొంది. బిజెపి నేతలు ఇలా తమ ప్రసంగాల్లో విద్వేషాన్ని కురిపిస్తూ, వక్రీకరించబడిన సమాచారంతో యాడ్‌లను కూడా విడుదల చేశారని అయినా ఒక్కసారి కూడా వారిపై చర్య తీసుకోలదని పేర్కొంది. ఈ లేఖపై పలు పౌర సమాజ సంస్థలు, సంఘాలతోపాటూ లాయర్లు, కార్యకర్తలు, చిత్ర నిర్మాతలు, విద్యావేత్తలు, పౌరులు ఇలా వివిధ రంగాలకు చెందిన 222 మంది సంతకాలు చేశారు.

➡️