హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ :   అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.   సెబీ రెగ్యులేటరీ డొమైన్‌లోకి ప్రవేశించడానికి కోర్టుకి పరిమితమైన అధికారం ఉందని పేర్కొంది. ‘‘ సెబీ 22 అంశాల్లో 20 విషయాల్లో దర్యాప్తును పూర్తి చేసింది. సొలిసిటర్‌ జనరల్‌ హామీని పరిగణనలోకి తీసుకుని మిగతా రెండు కేసుల దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించాం’’ అని కోర్టు తెలిపింది.

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గతేడాది నవంబర్‌ 24న విచారణను పూర్తి చేసి తీర్పుని రిజర్వ్‌ చేసింది.  సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యులపై వచ్చిన ఆరోపణలను నిరాధారమని పేర్కొంటూ తిరస్కరించింది.   భారతీయ పెట్టుబడి ప్రయోజనాలను బలోపేతం చేయడానికి కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరియు సెబీలని కూడా ఆదేశించింది. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

➡️