ముందుకు సాగని రుతుపవనాలు

Jun 20,2024 07:47 #rains, #weather report
  • జూన్‌లో 20శాతం తక్కువగా వర్షపాతం

న్యూఢిల్లీ : జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత దేశంలో జూన్‌ మాసంలో వర్షపాతం 20శాతం తక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. జూన్‌ 12 నుండి 18 మధ్య రుతుపవనాలు ముందుకు కదలక స్తంభించిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలిపింది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌, వాయవ్య బంగాళాఖాతం, బీహార్‌, జార్ఖండ్‌ల్లో పలు ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 1 నుండి 18 మధ్య దేశంలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. జూన్‌ 1 నుండి వాయవ్య భారతంలో 10.2 మి.మీ వర్షపాతం కురిసింది. ఇది సాధారణం కన్నా 70శాతం తక్కువ. మధ్య భారతంలో 50.5 మి.మీ వర్షం కురవగా ఇది సాధారణం కన్నా 31శాతం తక్కువ. ఇక దక్షిణ ద్వీపకల్పంలో 106.6మి.మీ వర్షం కురిసింది. ఇది సాధారణం కన్నా 16శాతం ఎక్కువ. తూర్పు, ఈశాన్య భారతంలో 146.7 మి.మీ వర్షం కురవగా ఇది సాధారణం కన్నా 15శాతం తక్కువ.

➡️