భద్రత డొల్ల

Dec 14,2023 07:35 #Parliament, #Winter session
parliament security

ఉలిక్కి పడ్డ పార్లమెంటు
లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వ్యక్తి
బిజెపి ఎంపి ఇచ్చిన పాస్‌ తో చొరబడ్డ దుండగులు
కలర్‌ స్మోక్‌ వదిలి భయభ్రాంతులు
బయటకు పరుగులు తీసిన ఎంపిలు
లోక్‌సభ స్పీకర్‌ చైర్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం
పట్టుకున్న ఎంపిలు…
భద్రతా సిబ్బందికి అప్పగింత – విజిటర్‌ పాస్‌ లు రద్దు…
భద్రతలో భారీ లోపం

పార్లమెంట్‌పై 22 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రవాద దాడిని స్మరించుకున్న రోజే.. కొత్త పార్ల మెంటులో పార్లమెంటులో ఎంపీల సాక్షిగా ఘోర భద్రతా ఉల్లంఘన చోటు చేసుకుంది. దీంతో లోక్‌సభలో అసాధారణ, దిగ్భ్రాంతికరమైన సన్నివేశాలు నెలకొన్నాయి. మైసూర్‌-కొడగు బిజెపి ఎంపీ ప్రతాప్‌ సిన్హ ఇచ్చిన పాస్‌తోనే ఇద్దరు దుండగులు లోక్‌సభలో ప్రవేశించి అలజడి సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగ (కలర్‌ స్మోక్‌)ను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు నినాదాలిస్తూ హల్‌చల్‌ చేశారు. వీరినల్గురిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టాయి. మొత్తం మీద ఈ వ్యవహారం భద్రతా వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

లోక్‌సభలో బుధవారం భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. సభలో ఒక్కసారిగా తీవ్ర అలజడి చోటు చేసుకుంది. సందర్శకుల గ్యాలరీ నుండి ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా సభలోకి దూకి అలజడి సృష్టించారు. సిలిండర్‌ ఆకారంలో ఉండే గ్యాస్‌ డబ్బాలను తమ వెంట తెచ్చుకున్న దుండగులు జీరో అవర్‌లో సభలో ప్రవేశించారు. వారిలో ఓ వ్యక్తి సభ్యులు కూర్చునే బెంచీలపై దూకుతూ కన్పించగా మరొకడు గ్యాలరీ నుండి కిందికి వేలాడుతూ డబ్బాలోని గ్యాస్‌ను బయటికి వదిలాడు. దీంతో సభలో తీవ్ర అలజడి, గందరగోళం ఏర్పడింది. దుండగులు ఇద్దరూ మైసూరుకు చెందిన బిజెపి ఎంపీ ప్రతాప్‌ సింహ నుండి పాస్‌లు తీసుకొని సభలో ప్రవేశించారని కొందరు ఎంపిలు తెలిపారు. కలకలం రేపిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, దర్యాప్తు బృందాలు, ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. చట్టవిరుద్ధంగా సభలో ప్రవేశించి అలజడి సృష్టించిన నిందితులను సాగర్‌ శర్మ, మనోరంజన్‌గా గుర్తించారు. వారి వద్ద నుండి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల కథనం ప్రకారం నిందితులిద్దరూ మైసూర్‌కు చెందిన వారు. సాగర్‌ శర్మ బెంగళూరులో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిమిత్తం అధికారులు నిందితుల నివాసాలకు చేరుకొని వారి నేపథ్యాన్ని ఆరా తీశారు. వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా ఉన్నాయా అన్న దానిపై దృష్టి సారించాయి. మరోవైపు ఫోరెన్సిక్‌ అధికారులు అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించారు. లోక్‌సభలో జరిగిన ఘటనపై స్పీకర్‌ ఓం బిర్లా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. శివసేన ఎంపీ అరవింద్‌ కథనం ప్రకారం…నిందితులలో ఒకడిని ఓ ఎంపీ పట్టుకున్నారు. ఆ సమయంలో మరో దుండగుడు బెంచీలపై గెంతుతూ భయానక వాతావరణాన్ని సృష్టించాడు. కాలి బూటును విప్పి అందులో దాచిన గ్యాస్‌ డబ్బాను తెరిచాడు. దీంతో ఆ ప్రదేశమంతటా పసుపుపచ్చని రంగులో పొగ వ్యాపించింది. ‘నియంతృత్వాన్ని అనుమతించకూడదు’ అని దుండగులు నినాదాలు చేసినట్లు కొందరు ఎంపీలు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సభాపతి స్థానంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్‌ కూర్చున్నారు. ‘సందర్శకుల గ్యాలరీ నుండి ఎవరో పడిపోయారని తొలుత సభ్యులు భావించారు. అప్పుడే రెండో వ్యక్తిని చూశాం. వారిలో ఒకరు తన బూటు నుండి ఒక క్యాన్‌ను బయటకు తీసి స్ప్రే చేశారు. ఎంపీలు గుర్జిత్‌ సింగ్‌ ఓజ్ల (కాంగ్రెస్‌), గోరంట్ల మదధవ్‌ (వైసిపి) హనుమాన్‌ వానియల్‌ (బిజెపి) వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఇది జరిగినప్పుడే పార్లమెంటు వెలుపల ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వారిలో ఒకరు హర్యానాలోని హిస్సార్‌కు చెందిన నీలం(42), మరొకరు మహారాష్ట్ర్లలోని లాతూర్‌కు చెందిన అమోల్‌ షిండే (25)గా భద్రతా దళాలు గుర్తించాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అగర్వాల్‌ సభను వాయిదా వేశారు. సభ తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమైంది. ఘటనపై విచారణ జరుగుతోందని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ‘సభలో ప్రవేశించిన ఇద్దరిని, సభ వెలుపల ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను లలిత్‌, విక్రమ్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులందరూ తమ బూట్లలో పొగ డబ్బాలను తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి. ”తమకు ఏ సంఘంతోనూ సంబంధం లేదు. ప్రభుత్వం పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున ఈ చర్యకు పాల్పడ్డాం” అని నిందితులు మీడియాతో అన్నారు.వివిధ ఏజెన్సీలు ఏకకాలంలో నిందితులను విచారించాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఆరుగురు సోషల్‌ మీడియాలో ఒకరికొకరు కనెక్ట్‌ అయినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్‌ బృందం పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి నమూనాలను సేకరించడం పూర్తి చేసింది.ఆరుగురు నిందితులు ఒకరికొకరు ఆరేళ్లుగా తెలుసునని, కొద్ది రోజుల క్రితం పథకం పన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురూ పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ ఇద్దరికి మాత్రమే విజిటర్స్‌ పాస్‌ లభించడంతో లోపలికి వెళ్లారు.పార్లమెంటు భద్రతను ఉల్లంఘించేలా ఏదైనా సంస్థ లేదా వ్యక్తి ఆరుగురు నిందితులకు ”సూచనలు” ఇచ్చారా? అని భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దుండగులు విడుదల చేసిన వాయువు హానికరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలింది’ అని చెప్పారు. జరిగిన ఘటనపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘2001లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. దానికి గుర్తుగా 19వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సమయంలో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళి అర్పిస్తున్నాం. ఇప్పుడు అదే సమయంలో దాడి జరగడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది’ అని కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ‘ఉండాల్సినంత భద్రత లేదా? ఎంపీలందరూ కలిసి దుండగులను పట్టుకున్నారు. మరి ఇతర భద్రతా సిబ్బంది ఎక్కడ ఉన్నారు?’ అని నిలదీశారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. ఈ ఘటన భద్రతాపరమైన ఉల్లంఘనేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ అన్నారు. సభకు వచ్చే వారికి ట్యాగ్‌లు ఉండవని అంటూ దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను గమనించానని, ఇకపై సందర్శకులకు పాస్‌లు ఏ విధంగా జారీ చేయాలనే విషయంపై ఎంపీలతో చర్చిస్తానని అన్నారు. సభ జీరో అవర్‌లో ఈ ఘటన జరిగిందని స్పీకర్‌ తెలిపారు. సభా కార్యక్రమాలు జరగకుండా ఎవరూ నిరోధించలేరని ఆయన సభ్యులకు హామీ ఇచ్చారు. మరో ఇద్దరు నిందితులను లలిత్‌, విక్రమ్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులందరూ తమ బూట్లలో పొగ డబ్బాలను తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి. ”తమకు ఏ సంఘంతోనూ సంబంధం లేదు. ప్రభుత్వం పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున ఈ చర్యకు పాల్పడ్డాం” నిందితులు మీడియాతో అన్నారు.వివిధ ఏజెన్సీలు ఏకకాలంలో నిందితులను విచారించాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఆరుగురు సోషల్‌ మీడియాలో ఒకరికొకరు కనెక్ట్‌ అయ్యారు.ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదుగురిని గుర్తించగా, ఒకరిని గుర్తించాల్సి ఉంది.ఫోరెన్సిక్‌ బృందం పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి నమూనాలను సేకరించడం పూర్తి చేసింది.ఆరుగురు నిందితులు ఒకరికొకరు ఆరేళ్లుగా తెలుసునని, కొద్ది రోజుల క్రితం పథకం పన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురూ పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ ఇద్దరికి మాత్రమే విజిటర్స్‌ పాస్‌ లభించడంతో లోపలికి వెళ్లారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించేలా ఏదైనా సంస్థ లేదా వ్యక్తి ఆరుగురు నిందితులకు ”సూచనలు” ఇచ్చారా? అని భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ఉన్నత స్థాయి విచారణ : ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్‌

‘భద్రతా వైఫల్యపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం. ఈ ఘటన నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవనంలో సెక్యూరిటీని సమీక్షించడం జరుగుతుంది. నిందితులు వదిలిన పొగ సాధారణమైనదే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దుండగులను పట్టుకోవడంలో ఎంపీలు, సిబ్బంది చూపిన చొరవ ప్రశంసనీయం.’

ప్రభుత్వానిదే బాధ్యత:కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌

‘సెక్యూరిటీ సిబ్బంది కాదు. ఎంపిలందరూ కలిసి ఆగంతకుడిని పట్టుకున్నారు. 2001 పార్లమెంట్‌పై దాడిలో అమరులైనవారిని ఉదయమే స్మరించుకున్నాము. ఇంతలోనే సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత’

బిజెపి ఎంపిపైనా సమగ్ర దర్యాప్తు : సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి

పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగి 22 ఏళ్లు అయిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన అలవిమాలిన భద్రతా వైఫల్యానికి నిదర్శనం. ఈ ఘటనలో దుండగుల ప్రవేశానికి వీలు కల్పించిన కర్ణాటక బిజెపి ఎంపితో సహా బాధ్యులందరిపైనా సమగ్రంగా, వేగంగా దర్యాప్తు చేయాలి.

➡️