PCI : ఫొటో జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన పిసిఐ

Mar 27,2024 12:11 #Delhi Police, #pci

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) మార్చి 21వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు గత ఆరు రోజులుగా నిరసన చేస్తున్నారు. అరెస్టయిన కేజ్రీవాల్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం రోజు కూడా ఆప్‌ కార్యకర్తలు, నేతలు ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేశారు. ప్రధాని నివాసం వద్ద ఘోరావ్‌కు యత్నించారు. ఈ ఆందోళనలకు సంబంధించిన న్యూస్‌ని కవర్‌ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. ఫొటోలను తీసేందుకు యత్నించిన ఇద్దరు ప్రముఖ న్యూస్‌ ఛానెళ్లకు చెందిన ఫొటో జర్నలిస్టులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. కొందరు పోలీస్‌ అధికారులు ఇండియా టు డే గ్రూప్‌కు చెందిన అరుణ్‌ ఠాకూర్‌ అనే సీనియర్‌ ఫొటో జర్నలిస్టు గొంతు పట్టుకున్నారు. హిందుస్తాన్‌ టైమ్స్‌కు చెందిన మరో ఫొటో జర్నలిస్టు సల్మాన్‌ అలీ మోచేతిని విరగ్గొట్టారు. ఫొటో జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని పిసిఐ (ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా) తీవ్రంగా ఖండించింది. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘రాజకీయ నిరసనలను కవర్‌ చేయడం రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టుల విధి. వారి విధులను నిర్వర్తించకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై దాడికి పాల్పడినట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జర్నలిస్టులపై, ఫొటో జర్నలిస్టులపై ఏ రూపంలోనైనా దాడి చేయడం ఆమోదయోగ్యం కాదు.’ ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పిసిఐ ప్రకటనలో వెల్లడించింది.

పత్రికా స్వేచ్ఛ జర్నలిస్టుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పలు మార్లు స్పష్టం చేసింది. తాజాగా ఈ ఏడాది మార్చి 12 ఎఎస్‌ ఓకా, ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ కూడా మరోసారి వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఎ) ప్రకారం పౌరులందరికీ వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, దానిపై పోలీసులు నియంత్రణ ఎంతవరకు ఉండాలో పోలీసు యంత్రాంగానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బెంచ్‌ పేర్కొంది. సుప్రీంకోర్టు హెచ్చరికల్ని కూడా ఈసందర్బంగా గుర్తుచేయాల్సి వచ్చిందని పిసిఐ ప్రకటనలో పేర్కొంది. అలాగే బాధిత ఫొటో జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలని, ఢిల్లీ పోలీసుల వైఖరిపై రిటైర్డ్‌ జడ్జి చేత ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా డిమాండ్‌ చేసింది.

➡️