పెగాసిస్‌ ప్రకంపనలు

Apr 24,2024 00:43 #Pegasis vibrations

-ఎన్నికల ముందు రచ్చ
– బిజెపి, బిఆర్‌ఎస్‌, టిడిపి,
-వైసిపి బెంబేలు

ఎలక్షన్‌ డెస్క్‌ :రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు  రాష్ట్రాల్లో పెగాసిస్‌ ప్రకంపనలు బిజెపి, బిఆర్‌ఎస్‌, టిడిపి, వైసిపి.. నాలుగు పార్టీలనూ దడ పుట్టిస్తున్నాయి. గత పదేళ్లల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, తెలంగాణాలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి, వైసిపిలు తమ రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్ల ట్యాపింగ్‌, హ్యాకింగ్‌నకు పాల్పడ్డాయని పరస్పర ఆరోపణలెదుర్కొంటున్నాయి. అందుకు అధునాతన సాంకేతిక పరికరాలను, పెగాసిస్‌ స్పైవేర్‌ వంటి వాటిని అనధికారికంగా వినియోగించారని విమర్శలొస్తున్నాయి. ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఎన్‌ఎస్‌ఒ అనే సంస్థ పెగాసిస్‌ స్పైవేర్‌ను రూపొందించి, ముప్పైకిపైగా దేశాలకు విక్రయించిందని, ఆయా దేశాల్లోని పలువురు రాజకీయ నాయకుల, హక్కుల కార్యకర్తల, న్యాయవాదుల, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్‌ చేశారని 2022లో మీడియా బయట పెట్టింది. పెగాసిన్‌ను ఇండియాకు కూడా సరఫరా చేశారని, అక్కడ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ సిఎం మమత, సహా పలు పార్టీల నేతల, జర్నలిస్టుల, హక్కుల కార్యకర్తల వంటి వారి ఫోన్లను హ్యాక్‌ చేశారని దుమారం లేచింది. స్పైవేర్‌ను తయారు చేసిన ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఒ ‘తాము ప్రభుత్వ సంస్థలకే అమ్మాం’ అని ప్రకటించడంతో మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని విపక్షాలు అప్పట్లో పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి. మోడీ సర్కారు నోరు మెదపలేదు. అనంతరం ఇజ్రాయిల్‌లో దర్యాప్తు ప్రారంభించడంతో మరొకసారి ఇక్కడి ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిలదీసినా కేంద్ర సర్కారు సమాధానం ఇవ్వలేదు.
తెలంగాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులతో…
తెలంగాణాలో కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక గడచిన పదేళ్ల బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతల, వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని విచారణలో తేల్చింది. పలువురు పోలీస్‌ అధికారులను అరెస్ట్‌ చేసింది. తెలంగాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయట పడటంతో ఎపిలో కూడా తమ ఫోన్లను వైసిపి సర్కార్‌ ట్యాప్‌ చేసిందని టిడిపి నేత నారా లోకేష్‌ పోలీసులకు, ఇసికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా టిడిపి ప్రభుత్వం పెగాసిస్‌ను ప్రయోగించి ప్రతిపక్షంలో ఉండగా తమ ఫోన్లు ట్యాప్‌ చేసిందని ఇంతకుముందు అసెంబ్లీలో వైసిపి చర్చ లేవదీసింది. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎబి వెంకటేశ్వరరావు ఇజ్రాయిల్‌ నుంచి పెగాసిన్‌ను కొనుగోలు చేశారని ఆరోపించింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు వైసిపి నేతలు టిడిపిపై విమర్శలు చేస్తున్నారు. అలాగే తెలంగాణాలో ఓటుకునోటు కేసు విషయంలో తమ ఫోన్లను అప్పటి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని నాటి ఎపి టిడిపి ప్రభుత్వం కేసులు పెట్టింది.

అందరి వేళ్లూ బిజెపి వైపే…
ఈ మొత్తంలో ట్విస్ట్‌ ఏంటంటే… ఇజ్రాయిల్‌ సంస్థ తాము ప్రభుత్వ సంస్థలకే స్పైవేర్‌ను అమ్మానంది. ఒక దేశం నుంచి ఇంకో దేశం స్పైవేర్‌ను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దాంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌, టిడిపి, వైసిపి నలుగురూ కలిసే అక్రమంగా తమ ప్రత్యర్ధుల ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారని ప్రజలు అనుమా నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను అస్థిర పర్చడానికి, పడగొట్టడానికి బిజెపి ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకిం గ్‌లకు పాల్ప డిందని ఆయా రాష్ట్రాల్లోని విపక్ష నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.

➡️