జార్ఖండ్‌ సిఎం నివాసం నుండి రూ.36 లక్షల నగదు, పత్రాలు సీజ్‌

న్యూఢిల్లీ  :   జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఢిల్లీ నివాసం నుండి రూ. 36 లక్షల నగదు, ఎస్‌యువి, కొన్ని పత్రాలను సీజ్‌ చేసినట్లు ఈడి అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుండి సోరెన్‌కు చెందిన దక్షిణ ఢిల్లీలోని 5/1 శాంతినికేతన్‌ రెసిడెన్సీలో ఈడి సోదాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రూ.36 లక్షల నగదు, హర్యానా నెంబర్‌ ప్లేట్‌తో, బినామీ పేరుతో రిజిస్టరైన బిఎండబ్ల్యు కారు., అక్రమ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

కాగా, గత రెండు రోజులుగా హేమంత్‌ సోరెన్‌ కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమతో టచ్‌లోనే ఉన్నట్లు జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జనవరి 31న రాంచీ నివాసంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈడి అధికారుల ముందు హాజరుకానున్నట్లు సోరెన్‌ ఈడికి  సమాచారమిచ్చారు.

జెఎంఎం నేతృత్వంలోని అధికారిక కూటమి ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాల్సిందిగా ఆదేశాలు అందినట్లు పార్టీ ప్రతినిధి పేర్కొన్నారు. నేడు రాంచీలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు అందినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ..సిఎం సోరెన్‌ భార్యకి సిఎం పగ్టాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

➡️