రాజకీయ నేపథ్యం న్యాయమూర్తి పదవికి అవరోధం కాదు

  • సిపిఎం సానుభూతిపరుడు మనోజ్‌ పులంబి మాధవన్‌పై
  • కేంద్ర అభ్యంతరాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సిపిఎం సానుభూతిపరుడి నియామకంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. న్యాయమూర్తి పదవి ఇవ్వొద్దనడానికి రాజకీయ నేపథ్యం తగిన కారణం కాదని పేర్కొంది. న్యాయవాది మనోజ్‌ పులంబి మాధవన్‌ను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. అయితే కొలీజియం ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ”మాధవన్‌ సిపిఎం సానుభూతిపరుడు. ఆయన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హయాంలో 2010, 2016-2021లో గవర్నమెంట్‌ ప్లీడర్‌గా కూడా పని చేశారు” అని కారణంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం ”మాధవన్‌ సిపిఎం సానుభూతిపరుడిగా పరిగణిస్తారనే వాదన చాలా అస్పష్టంగా ఉంటుంది. ఆయనకు రాజకీయ నేపథ్యం ఉందనే వాస్తవం అన్ని సందర్భాల్లోనూ తగిన కారణం కాకపోవచ్చు” అని కేంద్రం సూచనను తిరస్కరిస్తూ కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. వాస్తవానికి, మాధవన్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా పనిచేయడం వల్ల ఆయన వివిధ న్యాయ శాఖలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్న కేసులను వాదించడంతో తగినంత అనుభవం సంపాదించి ఉంటాడని కొలీజియం తీర్మానం నొక్కి చెప్పింది. ”ఉదాహరణకు ఇటీవలి కాలంలో ఒక న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే ఆమె ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ముందు ఆమె ఒక రాజకీయ పార్టీకి ఆఫీస్‌ బేరర్‌గా ఉన్నారు” అని తీర్మానంలో పేర్కొంది.
మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎల్‌ విక్టోరియా గౌరీ నియామకాన్ని ప్రస్తావిస్తూ కొలీజియం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ గౌరీ మద్రాసు హైకోర్టుకు న్యాయమూర్తిగా కావడానికి ముందు న్యాయవాదిగా ఉన్నప్పుడు బిజెపిలో ఉన్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తులుగా మాధవన్‌తోపాటు ఆరుగురు న్యాయవాదుల పేర్లను ఈ నెల 12న కొలీజియం సిఫార్సు చేసింది. మాధవన్‌ షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సి) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 35 తీర్పులను నివేదించారు. అయితే, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆయన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

➡️