ఎంత ధైర్యం ?

  • మోడీపై పూరీ శంకరాచార్య ఆగ్రహం
  • రాముడిని ఆయన తాకడం చూడలేను
  • అయోధ్యకు వెళ్లను

రత్లాం : పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉంటుందని తెలిపారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘నేను, నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు. అంతకుమించి మమ్మల్ని ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించలేదు. అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు’ అని శంకరాచార్య తెలిపారు. ‘నేను రామమందిరానికి వెళ్లడం లేదు. ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని కూడా అనుకోవడం లేదు. రాముడి విగ్రహాన్ని మోడీ తాకుతుంటే నేను ఎందుకు కరతాళధ్వనులు చేయాలి? జై జై అంటూ నినాదాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలకు నేను ఎందుకు పోవాలి?’ అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు సరిగా లేవని పూరీ శంకరాచార్య వ్యాఖ్యానించారు.

➡️