రబ్రీ, ఆమె కుమార్తెలకు బెయిలు

Feb 29,2024 10:26 #Bihar, #Enforcement Directorate

న్యూఢిల్లీ: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు బుధవారం నాడు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ముగ్గురూ దాఖలు చేసుకున్న బెయిల్‌ దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవవడంతో వారికి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గాగే బెయిల్‌ మంజూరు చేశారు. లక్ష రూపాయల బాండ్‌, అంతే మొత్తానికి షఉ్యరిటీ బాండ్‌ మీద బెయిల్‌ మంజూరు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవిల పెద్ద కుమార్తె అయిన మిసా భారతి ప్రస్తుతం బీహార్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిలు మంజూరు చేసేముందు కఠిన షరతులు విధించాలని కోర్టును ఇడి బుధవారంనాడు కోరింది. దీనికి ముందు గత ఫిబ్రవరి 9న వీరి బెయిలు దరఖాస్తు విచారణకు వచ్చింది. రెగ్యులర్‌ బెయిల్‌ అప్లికేషన్‌పై అడ్వాన్స్‌ ఆర్గుమెంట్లకు సమయం కావాలని ఇడి కోరడంతో న్యాయమూర్తి ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేశారు. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం రబ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు బుధవారంనాడు కోర్టు ముందు హాజరయ్యారు.

➡️