Rahul : రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తివేస్తాం యుపి ఎన్నికల సభలో రాహుల్‌ హామీ

May 29,2024 08:47 #Adani, #Ambani, #modi, #paramatma, #rahul

బంగాసన్‌ (యుపి) : ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బంగాసన్‌, డియోరియా, రుద్రాపూర్‌, వారణాసి తదితర ఎన్నికల సభల్లో ఆయన పాల్గన్నారు. ఇండియా బ్లాక్‌, రాజ్యాంగం ఒకవైపు వుంటే, మరోవైపు ఆ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని భావిస్తున్నవారు వున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏశక్తి భారత రాజ్యాంగాన్ని నాశనం చేయలేదని, తాము దానిని కాపాడుకుంటూనే ఉంటామని తెలిపారు. ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ పథకాన్ని చించి చెత్తబుట్టలో వేస్తుందని తెలిపారు.
‘తనను దేవుడే పంపించాడు’ అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘మిగతా అందరూ జీవ సంబంధమైన వాళ్లే. కానీ, నరేంద్రమోడీ జీవి కాదు. అంబానీ, అదానీలకు సహాయం చేయడానికి ఆయన ‘పరమాత్మ’ ద్వారా పంపబడ్డాడు. కానీ, ‘పరమాత్మ’ రైతులు, కూలీలకు సహాయం చేయడానికి మోడీని పంపలేదు’ అంటూ ఎద్దేవా చేశారు. నిజంగా ‘పరమాత్మ’ పంపివుంటే పేదలకు, రైతులకు సహాయం చేసి వుండేవాడని, మోడీని పంపిన దేవుడు ఎలాంటి దేవుడు?’ అని ప్రశ్నించారు. అధికారం చేపట్టగానే దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి పెడతామని చెప్పారు.
బిజెపి బిలియనీర్లకు రూ.16 లక్షల కోట్లు ఇచ్చిందని, ఇండియా వేదిక అధికారంలోకి రాగానే పేద ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇండియా వేదికకు సీట్లు క్యూకట్టనున్నాయని అన్నారు. నరేంద్రమోడీ ఈసారి ప్రధాని కాలేరని చెప్పారు. అన్యాయాన్ని నిర్మూలించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా వేదికను గెలిపించాలని కోరారు. అంతకుముందు ఎస్‌పి అధినేత అఖిలేష్‌యాదవ్‌ మాట్లాడుతూ మోడీ వాగ్దానం చేసిన బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎస్‌పి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలను, అభివృద్ధి పనులను చేపట్టిందని చెప్పారు.

➡️