రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు ఓ సాకు చూపుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఒక యూజర్‌ షేర్‌ చేసిన వీడియోను రాహుల్‌ గాందీ రీ పోస్ట్‌ చేశారు. ఈ వీడియో రైలు ప్రయాణికుల కష్టాలను చూపించారు. రిజర్వ్డ్‌ బోగీలోనూ ప్రయాణికులు కిక్కిరిసిపోయిన ఉండటం, బోగీలో చోటులేక టాయిలెట్‌ లో కూర్చుని ప్రయాణిస్తున్న అవస్థను ఈ వీడియోలో చూపించారు. మోడీ పాలనో రైలు ప్రయాణం శిక్షగా మారిందని, జనరల్‌ బోగీలను తగ్గించి ‘ఎలైట్‌ రైళ్ల'(లగ్జరీ ట్రైన్లను) మాత్రమే ప్రోత్సహిస్తుందని రాహుల్‌ విమర్శించారు. తద్వారా రైల్వే ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతోందని అన్నారు. కన్ఫర్మ్‌ చేసిన టిక్కెట్లతో కూడా ప్రయాణీకులు తమ సీట్లపై ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారని, సామాన్యులు మరుగుదొడ్డిలో దాక్కుని లేదా నేలపై కూర్చొని ప్రయాణం చేయవలసి వస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘మోడీ ప్రభుత్వం తన విధానాలతో రైల్వే వ్యవస్థలను బలహీన పరచి .. రైల్వేను తన స్నేహితులకు విక్రయించేందుకు ఒక సాకు చూపుతుంది’ అని గాంధీ ఆరోపించారు. సామాన్యులకు సౌకర్యవంతమైన రవాణా కావాలంటే రైల్వేలను నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని రాహుల్‌ గాంధీ పిలుపు నిచ్చారు.

➡️