86 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు కెఫేలో పేలుడు ఘటన : నిందితుని కోసం పోలీసులు గాలింపు

బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సిసిబి) చేపట్టింది. బాంబ్‌ స్క్వాడ్‌లు, ఫోరెన్సిక్‌ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. మంగళూరులో 2022లో జరిగిన పేలుడుకి సంబంధించిన ఐఇడిలు శుక్రవారం కేఫ్‌లో జరిగిన పేలుడులో ఉపయోగించిన ఐఇడిలకు మధ్య పోలిక ఉందా అనే కోణంలోనూ కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు పక్కా ప్రణాళికతోనే 68 నిమిషాల వ్యవధిలోనే అనుమానిత వ్యక్తి ఆ పేలుడుకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మాస్కు ధరించి, టోపి పెట్టుకుని 11.30 సమయంలో రామేశ్వరం కేఫ్‌లోకి వెళ్లాడు. 11.38 గంటలకు అతను రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేశాడు. 11.44 గంటలకు ఆ వ్యక్తి హ్యాండ్‌ వాష్‌ దగ్గరకు వెళ్లారు. ఇక 11.45 గంటలకు కేఫ్‌ నుండి బయటకు వచ్చాడు. ఆసమయంలో అతను తెచ్చుకున్న బ్యాగ్‌ను వెంట తీసుకెళ్లలేదు… కేఫ్‌లోనే ఉంచాడు. అతను బయటకు వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినట్లు సిసిటివి కెమెరాల్లో కనిపించింది. ఇక మధ్యాహ్నం 12.56 గంటలకు కేఫ్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన తర్వాత కేఫ్‌కి వంద మీటర్ల దూరంలో కూడా ఆ వ్యక్తి కనిపించలేదు.

ఈ ఘటనపై కర్ణాటక సిఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కేఫ్‌లో ముందుగానే టైమర్‌ని సెట్‌ చేసి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటాం అని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిద్ధరామయ్య పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

➡️