సందేశ్‌ఖాలీ ఘటనలు సిగ్గుచేటు

Apr 5,2024 00:22 #high court, #Kolkata
  •  బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడితే.. అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ వివాదంపై దర్యాప్తు జరిపించాలని దాఖలైన అఫిడవిట్‌లపై స్పందిస్తూ.. ‘అఫిడవిట్‌లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటు. అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలి’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే అరెస్టును తప్పించుకునేందుకు షాజహాన్‌ షేక్‌ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజులపాటు షాజహాన్‌ పరారీలో ఉండటంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

➡️