కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన సాంగ్లీ ఎంపి.. వందకు చేరిన ఎంపిల సంఖ్య

న్యూఢిల్లీ :    భారత్‌లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో రెబల్‌ ఎంపి విశాల్‌ పాటిల్‌ తిరిగి తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. విశాల్‌ పాటిల్‌ మద్దతుతో లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపిల సంఖ్య 100కి చేరింది. వికాస్‌ పాటిల్‌ మద్దతును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఎక్స్‌లో పేర్కొన్నారు. విశాల్‌ పాటిల్‌, విశ్వజిత్‌ కదమ్‌లు గురువారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిశారని, పార్టీకి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు విశాల్‌ పాటిల్‌ తెలిపారని ఖర్గే వెల్లడించారు.

మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవిఎ) కూటమిలో సీట్ల ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజకవర్గం శివసేన యుబిటికి కేటాయించారు. దీంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా మనవడైన విశాల్‌ పాటిల్‌ కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించారు. సాంగ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బిజెపి అభ్యర్థి సంజరు కాకా పాటిల్‌పై విజయం సాధించారు.

సీట్ల ఒప్పందానికి ముందే శివసేన వర్గానికి చెందిన ఉద్దవ్‌ థాకరే సాంగ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ పలుమార్లు ఉద్ధవ్‌ థాకరేను కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విశాల్‌ పాటిల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

మరో నేత పప్పుయాదవ్‌ కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పప్పు యాదవ్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయితే సీటల ఒప్పందంలో భాగంగా పూర్ణియా సీటు ఆర్‌జెడికి కేటాయించారు. దీంతో పప్పు యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

➡️