మొదటి జిఎస్‌టి ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్‌ మిశ్రా

న్యూఢిల్లీ : మొదటి జిఎస్‌టి అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా జస్టిస్‌ (రిటైర్డ్‌) సంజయ్ కుమార్‌ మిశ్రా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. సెంట్రల్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ యాక్ట్‌ కింద ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన ఏడేళ్ల తరువాత ఈ ట్రిబ్యునల్‌ అందుబాటులోకి వచ్చింది. జిఎస్‌టికు సంబంధించిన వివాదాలను ఈ ట్రిబ్యునల్‌ పరిష్కరిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ జార్ఘండ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ సంజయ్ కుమార్‌ మిశ్రాను జిఎస్‌టి ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ‘జిఎస్‌టి వివాదాలకు వేగవంతమైన, న్యాయమైన, సమర్థవంతమైన పరిష్కారాలను ఈ ట్రిబ్యునల్‌ చూపుతుంది. న్యాయస్థానాలపై భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ట్రిబ్యునల్‌ ఏర్పాటు దేశంలో జిఎస్‌టి వ్యవస్థ ప్రభావాన్ని మరింత మెరుగుపరుస్తుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

➡️