సర్దార్‌ పటేల్‌ విగ్రహంపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు .. మధ్యప్రదేశ్‌లో ఘటన

Jan 25,2024 15:20 #Clashes, #Madhya Pradesh, #Sardar Patel

ఉజ్జయిని :    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో గురువారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాలు రాళ్లురువ్వుకోవడంతో .. ఒక పోలీస్‌ అధికారికి తీవ్రగాయాలయ్యాయి. రెండు బైక్‌లను తగులబెట్టగా, పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

వివరాల ప్రకారం.. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్వస్థలమైన, ఉజ్జయిని నగరానికి 50 కి.మీ దూరంలోని మక్డోన్‌ బస్‌స్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. మక్డోన్‌ ప్రాంతంలో పాటిదార్‌ కమ్యూనిటీ బుధవారం సాయంత్రం సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే అదే ప్రాంతంలో దళిత కమ్యూనిటీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

బుధవారం అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పాటిదార్‌ కమ్యూనిటీ దళిత వర్గంపై రాళ్లు రువ్వింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పాటు బైక్‌లకు నిప్పుపెట్టారు. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి నితేష్‌ భార్గవా తెలిపారు. ఇరు వర్గాలతో చర్చిస్తున్నామని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని చెప్పారు. ఈ ఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

➡️