రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారు- తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం ఆగ్రహం

పొన్ముడిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాజ్యాంగానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చర్యలని తీవ్రంగా తప్పుపట్టింది. మాజీ మంత్రి పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో తీసుకునే అంశంపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేకుంటే తాము జోక్యం చేసుకోవాల్సివుంటుందని హెచ్చరించింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో మాజీ మంత్రి పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షికి మద్రాసు హైకోర్టు గతంలో జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించారు. తాజాగా హైకోర్టును తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్‌ ఇటీవల ప్రకటించారు. పొన్ముడి చేత మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేశారు. ఇందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నిరాకరించారు. సుప్రీంకోర్టు తీర్పుకే సొంత భాష్యం చెప్పారు. జైలు శిక్షపై స్టే మాత్రమే వచ్చిందని, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‘గవర్నర్‌ వ్యవహార శైలి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆయన చర్యలు సుప్రీంకోర్టును ధిక్కరించేలా ఉన్నాయి. ఇలా చేయడం తగదు. శిక్షపై మేం స్టే ఇచ్చామంటే.. అది నిలిచిపోయినట్లే. ఒక వ్యక్తి/మంత్రిపై మనకు విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే. 24 గంటల్లోగా ఈ అంశాన్ని గవర్నర్‌ తేల్చాలి’ అని అల్టిమేటమ్‌ ఇచ్చింది. లేదంటే మేమే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం హెచ్చరించింది.

➡️