సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : సందేశ్‌ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్‌ఖలి కేసు విచారణను, నిందితుడు టిఎంసి నాయకుడు షేక్‌ షాజహాన్‌ను సిబిఐకి అప్పగించాలని ఈ నెల 5న బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వాన్ని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మమతా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌ను విచారించిన జస్టిస్‌ బిఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో బెంగాల్‌ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్‌ను తక్షణమే ఎందుకు అరెస్టు చేయలేదని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి బెంగాల్‌ ప్రభుత్వ తరుపున హాజరైన సీనియర్‌ న్యాయవాదులు ఎ.ఎం సింఘ్వి, జైదీప్‌ గుప్తా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. బెంగాల్‌ పోలీసులు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఇడి తరుపున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు ఆరోపించారు.

➡️