ఫేస్‌బుక్‌ లైవ్‌లో శివసేన(యుబిటి)నేత దారుణ హత్య

ముంబయి : ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగానే శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే గ్రూపు)కు చెందిన ఒక నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయి లో చోటుచేసుకుంది. స్థానిక సామాజిక ఉద్యమకారుడు మౌరిస్‌ నొరాన్హ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (యూబీటీ) గ్రూపునకు చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతడి తండ్రి వినోద్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. స్థానిక ఉద్యమకారుడైన నొరాన్హ, అభిషేక్‌ల మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత వైరం ఉంది. ఈ క్రమంలో ముంబయిలోని బొరివ్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీ అభివద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నొరాన్హ తన కార్యాలయానికి అభిషేక్‌ను ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన అభిషేక్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో మాట్లాడుతుండగా నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పొట్టలో, భుజంలోకి తూటాలు దూసుకెళ్లడంతో బాధితుడు కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అభిషేక్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం నొరాన్హ తనని తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటన అంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డు అయింది.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్‌ షిండే విచారణకు ఆదేశించగా, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజరు రౌత్‌ డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు కరవయ్యాయని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు.

➡️