స్మృతి ఇరానీకి ఎదురుగాలి !

May 19,2024 08:35 #Smriti Irani
  •  బిజెపికి ఓట్లు వేయబోమని క్షత్రియ సామాజిక వర్గం ప్రతిజ్ఞ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఐదో దశ పోలింగ్‌ జరగబోయే 14 నియోజకవర్గాల్లో అమేథీ ఒకటి. ఇక్కడ నుంచి బిజెపి తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇండియా ఫోరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కెఎల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన స్మృతి ఇరానీకి, ఈసారి ఎదురుగాలి తప్పదనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి పట్ల క్షత్రియ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బిజెపికి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతి ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?
కొంతకాలం క్రితం కాంగ్రెస్‌ నేత దీపక్‌ సింగ్‌పై అక్రమంగా కేసు పెట్టడం పట్ల వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపిలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ బిజెపి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు మహిళలను అవమానిస్తున్నారని, బిజెపి అధినేత, అగ్రనాయకత్వం కూడా పెదవి విప్పడం లేదని అన్నారు. బిజెపికి చెందిన నాయకులందరినీ వ్యతిరేకిస్తామని, వారికి ఓటేయబోమని చెప్పారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాజ్‌పుత్‌ సమాజానికి చెందిన వారెవరూ బిజెపికి ఓటు వేయరని తెలిపారు. బిజెపికి ఓటేశామని, రాజ్‌పుత్‌లను కూలీలుగా ఆ పార్టీ నిలబెట్టిందని అన్నారు. దేశంలోని రాజ్‌పుత్‌లు బిజెపికి ఓటు వేయరని ప్రకటిస్తున్నామని మహిపాల్‌ సింగ్‌ చెప్పారు. స్మృతి ఇరానీ మహిళా ఎంపిగా మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, పార్లమెంట్‌లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవ కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదని అన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను కట్టడి చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని చెప్పారు. వసుంధర రాజేను పక్కనపెట్టారని, మధ్యప్రదేశ్‌లో సిఎం పదవి నుంచి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను, హర్యానాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తొలగించారని, రమణ్‌సింగ్‌ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు. బిజెపిలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని చెప్పారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ను బిజెపి పక్కన పెట్టిందని అన్నారు. బిజెపిలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని చెప్పారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బిజెపిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

➡️